ఒక్క వంటకంలో కచ్చితంగా వెల్లుల్లి ఉండాల్సిందే. కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వెల్లుల్లి.
ఇందులో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే సత్తా వెల్లుల్లికి ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే అంతా బాగానే ఉన్నా అసలు వెల్లుల్లి కూరగాయనా.? మసాలానా..? అనే సందేహం ఎన్నో ఏళ్ల నుంచి వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్ట్ ముగింపు పలికింది.
నిజానికి వెల్లుల్లి కూరగాయనా, మసాలానా.? అనే చర్చ ఇప్పుడు మొదలైంది కాదు. 2015 నుంచి ఉంది. నిజానికి అంతకు ముందు వెల్లుల్లి మసాలా జాబితాలో ఉండేది. అయితే ఆ తర్వాత రైతు సంఘాల అభ్యర్థన మేరకు వెల్లుల్లిని కూరగాయల కేటగిరీలో చేర్చారు. అయితే ఆ తర్వాత వ్యవసాయ శాఖ ఈ ఉత్తర్వును రద్దు చేసి మళ్లీ వెల్లుల్లికి మసాలా హోదా ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం, 1972లో వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా అభివర్ణించారని వ్యవసాయ శాఖ వాదించింది. అయితే ఇది నచ్చక రైతు సంఘాలు మళ్లీ 2017లో రివ్యూ పిటిషన్ కోర్టులో ఈ విషయాన్ని దాఖలు చేశాయి. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ అంశానికి సంబంధించి తాజాగా కీలక తీర్పు వెలువరించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ 2015 నిర్ణయాన్ని సమర్థించింది. వెల్లుల్లిని కూరగాయగా ప్రకటించింది. దీంతో వెల్లుల్లి మళ్లీ కూరగాయల జాబితాలోకి వెల్లుల్లి వచ్చేసింది. అయితే గతంలో వెల్లుల్లిని సుగంధ ద్రవ్యాల జాబితాలో చేర్చిన వ్యవసాయ శాఖ ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్తుందా.? లేదా కూరగాయగానే భావించి ఈ వివాదానికి స్వస్తి పలుకుతుందా వేచి చూడాలి. ఇదిలా ఉంటే అసలు భారతీయులకు వెల్లుల్లి ఎలా పరిచయమైంది.? వెల్లుల్లి వెనకాల ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. భారతదేశానికి వెల్లుల్లి మధ్య ఆసియా నుంచి వచ్చిందని చెబుతుంటారు. అంటే ప్రస్తుత ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చినట్లు చెబుతుంటారు. ఇక కొంతమంది చరిత్రకారులు మాత్రం వెల్లుల్లి మొదట పశ్చిమ చైనాకు సమీపంలో ఉన్న టియాన్ షాన్ పర్వతాలలో కనుగొన్నట్లు చెబుతున్నారు. అక్కడి నుంచే భారత్‌తో పాటు, ప్రపంచం మొత్తానికి వ్యాపించిందని చెబుతుంటారు.