వ్యక్తిగత రుణాన్ని సెటిల్‌ చేసుకుంటే ఇబ్బందేనా

ప్రస్తుతం వ్యక్తిగత రుణాలను బ్యాంకులు విరివిరిగానే ఇస్తున్నాయి. అయితే, ఇలా బ్యాంకు అందజేసిన ప్రతి రుణం వడ్డీతో సహా బ్యాంకుకు తిరిగి వచ్చేస్తుందని గ్యారెంటీ ఏమి లేదు.


కొన్ని రుణాలు డిఫాల్ట్‌ అవ్వవచ్చు. EMIలు చెల్లించలేని కొన్ని రుణాలకు సెటిల్‌మెంట్‌ ఆప్షన్ కూడా అందిస్తుంటాయి. ఈ రుణ సెటిల్‌మెంట్‌ అంటే తెలుసుకోవడంతో పాటు దీనికి సంబంధించిన లాభ, నష్టాలను తెలుసుకోవడం చాలా అవసరం.

రుణ సెటిల్‌మెంట్‌ అంటే

వ్యక్తిగత రుణ సెటిల్‌మెంట్‌..రుణగ్రహీత, బ్యాంకు మధ్య(తక్కువ చెల్లింపును అంగీకరిస్తూ) జరిగే ఒప్పందం. ఇందులో రుణగ్రహీత పూర్తి మొత్తానికి బదులుగా రుణంలో కొంత వరకు తిరిగి చెల్లించడానికి అంగీకరిస్తాడు. సాధారణంగా, రుణగ్రహీత ఆర్థికంగా ఇబ్బందుల వల్ల రుణ చెల్లింపులను కొనసాగించలేనప్పుడు బ్యాంకులు ఈ ఆప్షన్ అందించవచ్చు. ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు లేదా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వంటి వివిధ కారణాల వల్ల రుణగ్రహీత EMIలు చెల్లించడం కష్టతరం అవుతున్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రయోజనాలు

సెటిల్‌మెంట్‌ ప్రక్రియ బ్యాంకింగ్‌ నిబంధనల ద్వారానే అధికారికంగా జరుగుతుంది. సెటిల్‌మెంట్‌ మొత్తం సాధారణంగా బాకీ ఉన్న బ్యాలెన్స్‌ కంటే తక్కువగానే ఉంటుంది. ఇది రుణాన్ని త్వరగా క్లియర్‌ చేయడానికి, వడ్డీ భారం తగ్గిస్తూ రుణగ్రహీతకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా, రుణగ్రహీత చెల్లించాల్సిన దానికంటే తక్కువ చెల్లించడం ద్వారా రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఎక్కువ కాలం కొనసాగే రుణం త్వరగా ముగిసిపోతుంది. రుణ సెటిల్‌మెంట్‌ మీ రుణాన్ని నిరర్ధక ఆస్తి(NPA)గా వర్గీకరించకుండా, చట్టపరమైన చర్యలు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

భవిష్యత్తులో ఇబ్బందులు

రుణ సెటిల్‌మెంట్‌ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు స్వల్పకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ, ఇది భవిష్యత్తులో రుణగ్రహీతకు సంబంధించిన క్రెడిట్‌ స్కోరును, ఆర్థిక ఖ్యాతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సెటిల్‌ అయిన రుణాలు క్రెడిట్‌ నివేదికలో ‘సెటిల్డ్’గానే నమోదవుతాయి. అయితే, ఇది రుణాన్ని ముగించడం లాంటిది కాదు. సెటిల్ చేసిన రుణం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై నెగటివ్ మార్క్ ఉంటుంది. పూర్తి రుణాన్ని తిరిగి చెల్లిస్తే పాజిటివ్‌ మార్క్‌ ఉంటుంది. ఇంకా సెంటిల్‌మెంట్‌ సమయంలో బ్యాంకులు అదనపు రుసుములు లేదా జరిమానాలు విధించొచ్చు. ఇది రుణాన్ని సెటిల్‌ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభావితం చేస్తుంది.

క్రెడిట్‌ బ్యూరోలు సెటిల్‌ అయిన రుణాన్ని చూసినప్పుడు, వారు ప్రతికూల క్రెడిట్‌గా పరిగణిస్తారు. ఈ ప్రతికూల క్రెడిట్‌ సంఘటన భవిష్యత్తులో మీరు బ్యాంకు రుణాన్ని ఆశించిననప్పుడు అడ్డుకుంటుంది. క్రెడిట్‌ హిస్టరీలో ఇది ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే, ఏడేళ్ల పాటు రుణాలు అభ్యర్థించిన ప్రతిసారి బ్యాంకులకు రుణ సెటిల్‌మెంట్‌ వ్యవహారాన్ని గుర్తుచేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రుణగ్రహీతకు ఆటంకం కలిగిస్తుంది. బ్యాంకులు క్రెడిట్‌ కార్డు లేదా రుణ దరఖాస్తులను తిరస్కరించొచ్చు. ఒకవేళ బ్యాంకు రుణం లభించినా అధిక వడ్డీ రేటును వసూలుజేస్తాయి.

పరిష్కారం ఉందా?

రుణగ్రహీత రుణ సెటిల్‌మెంట్‌ను అభ్యర్థించే బదులు రుణ వాయిదాల సంఖ్యను పెంచమని అడగడం మేలు. దీనివల్ల చెల్లించాల్సిన EMI మొత్తం తగ్గుతుంది. కొత్త ఈఎంఐ షెడ్యూల్‌తో రుణాన్ని పునర్నిర్మించమని బ్యాంకును అభ్యర్థించొచ్చు. ఇంకా, తక్కువ వడ్డీ రేటుకు బ్యాలెన్స్‌ బదిలీకి ఒప్పుకునే బ్యాంకుకు మీ రుణాన్ని మార్చుకోవచ్చు. మీకు ఎఫ్‌డీలు, పీఎఫ్‌లు లాంటివి ఉంటే వాటిని ఉపసంహరించుకుని బ్యాంకు రుణాన్ని పూర్తిగా తీర్చేయొచ్చు.

క్రెడిట్‌ స్కోరు పెంచుకోవచ్చా?

రుణ సెటిల్‌మెంట్‌ క్రెడిట్‌ స్కోరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కానీ, దీన్ని గాడిలో పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఇంకా రుణాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అన్ని బకాయిలు, ఈఎంఐలు సకాలంలో చెల్లించండి. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి(CUR) తక్కువగా ఉంచడం మేలు. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ రుణాలకు గానీ, క్రెడిట్‌ కార్డులకు గానీ దరఖాస్తు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏవైనా ఇతర రుణాలను పూర్తిగా చెల్లించినప్పుడు, ఆ ఖాతాలను క్లోజ్ చేయమని బ్యాంకును అడగండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.