ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ను జనం వేయించకున్న తర్వాత నుంచే యువతలో ఆకస్మిక మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. నడుస్తూ ఉన్నోళ్లు సడెన్ గా కుప్పకూలి చనిపోవడం, పెళ్లిళ్లో డ్యాన్స్ చేస్తూనే సడెన్ గా కిందపడి మరణించడం, నవ్వుతూనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా కళ్లు తేలేయడం వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం.
సెడన్ హార్ట్ ఎటాక్ కారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ సెలబ్రిటీలు కూడా చనిపోయారు. అయితే యువతలో ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న సమయంలో దీని మీద కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలపై నెలకొన్న ఆందోళనలకు, అనుమానాలకు తెరదించుతూ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కరోనా వ్యాక్సిన్స్ లకు, దేశంలో ఆసక్మిక మరణాలకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR),నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC)చేపట్టిన లోతైన అధ్యయనాల్లో తేలిందని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ ఆకస్మిక మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి పలు సంస్థలు విస్తృత పరిశోధనలు చేయగా.. ఈ పరిశోధనలన్నీ భారతదేశంలో వేసిన కోవిడ్ టీకాలు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి అని తేల్చి చెప్పాయి.
రెండు కీలక అధ్యయనాలు చెప్పిన నిజాలు
ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారిలో ఆకస్మిక మరణాలపై ICMR, NCDC రెండు కీలక అధ్యయనాలు చేపట్టాయి. అధ్యయనాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 47 హాస్పిటల్స్ లో అక్టోబర్ 2021 నుండి 2023 మార్చి మధ్య కాలంలో అకస్మాత్తుగా మరణించిన వారి కేసులను లోతుగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణాల ముప్పు ఏమాత్రం పెరగలేదని నిశ్చయంగా తేలింది.
ఢిల్లీ ఎయిమ్స్ నేతృత్వంలో ప్రస్తుతం జరుగుతున్న మరో అధ్యయనంలో యువతలో ఆకస్మిక మరణాలకు గుండెపోటులే ప్రధాన కారణంగా ఉన్నాయని ప్రాథమికంగా తేలింది. గత ఏళ్లతో పోలిస్తే మరణాల కారణాలలో పెద్దగా మార్పులేదని, కొన్ని కేసుల్లో జన్యుపరమైన లోపాలు కూడా మరణాలకు దారితీశాయని గుర్తించారు.
నిపుణుల హెచ్చరిక
కోవిడ్ టీకాలను ఆకస్మిక మరణాలతో ముడిపెడుతూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించేవేనని సైంటిస్టులు పునరుద్ఘాటించారు. మహమ్మారి సమయంలో కోట్లాది ప్రాణాలను కాపాడిన వ్యాక్సిన్‌లపై ఇలాంటి నిరాధారమైన వదంతులు ప్రజల్లో అనవసర భయాలను, అపోహలను సృష్టిస్తాయని, ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ శాస్త్రీయ ఆధారాలతోనే ముందుకు వెళ్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరి ఈ మరణాలకు కారణమేంటి?
ఆకస్మిక గుండె మరణాల వెనుక అనేక కారణాలు ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి
-జన్యుపరమైన సమస్యలు
-అనారోగ్యకరమైన జీవనశైలి
-ముందు నుంచే ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు
-కోవిడ్ సోకిన తర్వాత కలిగే ఆరోగ్య సమస్యలు
































