వానాకాలంలో గోడలు చెమ్మ పట్టడం సహజమే. అయితే..ఈ సమస్యను తగ్గించేందుకు ఎక్కువగా ఖర్చు చేసే పని లేకుండా కొన్ని ఇంటి చిట్కాలతోనే పరిష్కరించుకోవచ్చు.
అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలో ఎదుర్కొనే ప్రధాన సమస్య గోడలకు చెమ్మపట్టడం. కిచెన్, బెడ్ రూమ్స్, హాల్.. ఇలా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా దాదాపు అన్ని చోట్ల గోడలకు చెమ్మపడుతుంది. అన్ని ఇళ్లలోనూ ఇదే జరుగుతుందని కాదు. కానీ..ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కొన్ని ఇళ్లలో ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. వాతావరణంలో ఉండే తేమ అంతా గోడలకు పడుతుంది. అది అంత తొందరగా వదలదు. ఫలితంగా పెయింట్ అంతా పొట్టుగా మారిపోయి ఊడిపోతుంది.
ఆ ప్రాంతమంతా గోడ పాడైపోతుంది. అంతే కాదు. కొన్ని సార్లు ఆ చోట నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇది మరింత చిరాకు పుట్టిస్తుంది. తడి ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే ఫంగస్ కూడా వచ్చి చేరుతుంది. అయితే..ఈ చెమ్మను వదిలించుకోడానికి ఎన్నో పద్ధతులుంటాయి. కాకపోతే అవన్నీ కాస్త ఖర్చుతో కూడుకున్నవి. మరీ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సింపుల్ గా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం. వేపాకులతో స్ప్రే
ఇది చాలా బాగా పని చేస్తుంది. అయితే..గోడలకు ఇలా ఫంగస్ పట్టినప్పుడు కొన్ని వేపాకులను తీసుకుని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారే వరకూ అలాగే ఉంచాలి. ఆ తరవాత ఓ స్ప్రే బాటిల్ లో ఈ నీళ్లు పోయాలి. ఈ వాటర్ ని గోడలపై స్ప్రే చేయాలి. లేదా ఓ క్లాథ్ పై పోసి దాంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ఈ ఫంగస్ తగ్గిపోతుంది. పైగా ఇల్లంతా సువాసన కూడా వస్తుంది.
చెమ్మ పట్టకుండా
ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే..ఇలా చెమ్మ పట్టి పెయింట్ అంతా పాడైపోతుంటే వెనిగర్ తో పరిష్కరించుకోవచ్చు.
వెనిగర్, నీళ్లు సమపాళ్లలో కలిపి ఓ స్ప్రే బాటిల్ లో పోయాలి. పెయింట్ పొలుసులుగా మారిన చోట స్ప్రే చేయాలి. ఆ తడి పూర్తిగా ఆరిపోయేంత వరకూ అలాగే వదిలేయాలి. పూర్తిగా ఎండిపోయిన తరవాత మళ్లీ అక్కడ చెమ్మ పట్టే అవకాశం చాలా వరకూ తగ్గుతుంది. పైగా దుర్వాసన, పెయింట్ రాలిపోవడం లాంటి ఇబ్బందులు కూడా రావు. గోడలు ఎక్కువ రోజుల పాటు నిలిచి ఉండేందుకు ఈ చిట్కా కొంత వరకూ ఉపయోగపడుతుంది.
ఫర్నిచర్ పాడవకుండా
గోడలకు ఇలా చెమ్మ పట్టినప్పుడు వాటికి ఆనుకుని ఉండే ఫర్నిచర్ కూడా పాడైపోతుంది. చెక్క పూర్తిగా ఉబ్బిపోవడం, లేదా పగిలిపోవడం లాంటిలి జరుగుతాయి. అయితే..ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే సిలికా జెల్ ప్యాకెట్స్ వాడాలి. ఈ చిన్న సాచెట్స్ కొత్త షూస్, బ్యాగ్స్ కొన్నప్పుడు ఆ ప్యాకింగ్ లో వస్తాయి. ఇవి తేమను చాలా త్వరగా అబ్జార్బ్ చేసుకుంటాయి. వాటిని చెత్తబుట్టలో పారేయకుండా కాస్త ఎండ తగిలేలా ఉంచాలి. దీని వల్ల తేమను అబ్జార్బ్ చేసే గుణం ఇంకా పెరుగుతుంది. డ్రాయర్స్, కప్ బోర్డ్స్, కుషన్స్ కింద వీటిని ఉంచితే మంచిది. ఇవి చాలా త్వరగా తేమను లాగేసుకుంటాయి. ఫర్నిచర్ పాడవకుండా కాపాడతాయి. చెక్క తడిసిన తరవాత వచ్చే దుర్వాసనను కూడా ఇవి పోగొడతాయి.
బాత్రూమ్ గోడలపై
బాత్రూమ్ గోడలపై ఎక్కువగా చెమ్మ పడుతూ ఉంటుంది. ఇక్కడే దుర్వాసన ఎక్కువగా వచ్చే అవకాశాలూ ఉంటాయి. ఇక బాత్రూమ్స్ కి వెంటిలేషన్ సరిగ్గా లేదంటే ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే..ఈ ఇబ్బంది ఉన్నప్పుడు ఓ గిన్నెలో కల్లుప్పు పోయాలి. అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. వీటిని బాత్రూమ్ లో ఓ మూల ఉంచాలి. ఉప్పు గాలిలో ఉండే తేమను సహజంగానే అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక యూకలిప్టస్ ఆయిల్ బ్యాక్టీరియాని తొలగిస్తుంది. దీంతోపాటు ఫంగస్ ని కూడా నిర్మూలిస్తుంది. అంతే కాదు. బాత్రూమ్ అంతా సువాసన వచ్చేలా చేస్తుంది.
మొక్కజొన్న పిండితో
గోడలకు చెమ్మ పట్టినప్పుడు ఇవి చాలా స్లిప్పరీగా మారిపోతాయి. అంటే..అక్కడ ముట్టుకుంటేనే జారిపోతుంది. ఇదే చోట రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అయితే..ఈ చెమ్మను తగ్గించేందుకు మొక్కజొన్న పిండిని వాడొచ్చు. చెమ్మపట్టిన చోట మొక్కజొన్న పిండిని చల్లాలి. కనీసం పది నుంచి పదిహేను నిముషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా ఉంచడం వల్ల చాలా త్వరగా చెమ్మ అంతా తగ్గిపోతుంది. మొక్కజొన్న పిండి తేమను గ్రహిస్తుంది. ఫలితంగా గోడలు చాలా త్వరగా పొడిబారేందుకు అవకాశం ఉంటుంది.
గమనిక:ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే.ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు
































