ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ ఈ రోజు (జులై 26) నుంచి ప్రారంభమయ్యాయి.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జులై 26 నుంచి ఆగస్టు 1 వరకు జరుగుతాయి. ధ్రువపత్రాల పరిశీలన జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు ఉంటుంది. ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 2న నిర్వహించనున్నారు.
కోర్సులు, కళాశాలల ఎంపికకు ఆగస్టు 4 నుంచి 8 వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 8న ఐచ్ఛికాలు మార్పు చేసుకోవచ్చు. ఆగస్టు 10న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఆగస్టు 12 నుంచి 16వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది. ఇక ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఏపీ ఐసెట్ 2024 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు
నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2024 ప్రత్యేక విడత ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి జులై 26న నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. జులై 26 స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, జులై 27న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని అన్నారు. ఇక జులై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, జులై 31న సీట్ల కేటాయింపు ఉంటుందని ఆమె వివరించారు.