చాలామందికి ఉదయం లేవగానే చాయ్ తాగే అలవాటు ఉంటుంది. అయితే, మీరు చేసే చాయ్ అద్భుతంగా, రుచిగా ఉండటం లేదని ఎప్పుడైనా అనిపించిందా? దానికి ఒక కారణం ఉంది.
చాయ్ తయారు చేసే విధానం సరైనది కాకపోవడమే ఆ కారణం. పర్ఫెక్ట్ చాయ్ ఎలా చేయాలో తెలుసుకోవడం ఒక కళ. ఇప్పుడు, ఆ రహస్యం ఏమిటో, మీరు సాధారణంగా చేసే తప్పులు ఏమిటో చూద్దాం.
పర్ఫెక్ట్ చాయ్ ఎలా చేయాలి?
చాలామందికి చాయ్ చేయడం సులభం అనిపిస్తుంది, కానీ ఇది ఒక కళ. సరైన పద్ధతిలో చాయ్ తయారు చేస్తే దాని రుచి చాలా పెరుగుతుంది.
స్టెప్ 1: నీళ్లు, చాయ్ పొడి
చాయ్ చేయడం నీళ్లతో మొదలవుతుంది. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత చాయ్ పొడిని వేయండి. ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ సమయంలో అల్లం లేదా యాలకులను కూడా వేసుకోవచ్చు.
స్టెప్ 2: చక్కెర ఎప్పుడు వేయాలి?
చాలామంది పాలు వేసిన తర్వాత చక్కెర వేస్తారు. కానీ సరైన సమయం నీళ్లు, చాయ్ పొడి మరిగిన తర్వాతే. ఫ్లేవర్ బాగా కలిసిన తర్వాత చక్కెర వేసి, అది కరిగే వరకు ఉంచాలి.
స్టెప్ 3: పాలు ఎప్పుడు వేయాలి?
చక్కెర కరిగిన తర్వాత పాలు వేయండి. ఆ తర్వాత చాయ్‌ను ఐదు నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. దీనివల్ల చాయ్ రంగు ముదురుగా, రుచి సమతుల్యంగా ఉంటుంది. ఇదే పర్ఫెక్ట్ చాయ్ రహస్యం.
సాధారణంగా చేసే తప్పులు
అన్నింటినీ కలిపి వేయడం: నీళ్లు, పాలు, చాయ్ పొడి, చక్కెర అన్నింటినీ ఒకేసారి వేస్తే చాయ్ రుచి చెడిపోతుంది.
ఎక్కువ సేపు మరిగించడం: ఎక్కువ సేపు మరిగిస్తే చాయ్ చేదుగా మారుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యలను కూడా పెంచుతుంది.
ఎక్కువ చాయ్ పొడి వేయడం: కొంతమంది ఘాటుగా ఉండాలని ఎక్కువ చాయ్ పొడి వేస్తారు. ఇది రుచిని పాడు చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.






























