భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని అధిగమిస్తోంది. స్పేస్ టెక్నాలజీలో సరికొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన కొత్త ప్రయోగం సక్సెస్ అవుతోంది.
ఇందులో భాగంగా PSLV-C60 రాకెట్ ద్వారా “స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్” (SpaDEx) పేరుతో రెండు ఉపగ్రహాలను (SDX01, SDX02) నింగిలోకి విజయవంతంగా పంపింది.
డిసెంబర్ 30 రాత్రి 10.00 గంటల 15 సెకండ్లకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C60 రాకెట్ నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లింది. రెండు కీలక శాటిలైట్లతోపాటూ.. కొన్ని నానో శాటిలైట్లను కూడా ఈ రాకెట్ రోదసిలోకి తీసుకెళ్లింది.
ఇస్రో ఈ ప్రయోగం ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX)లో కీలకమైన ఛేజర్, టార్గెట్ (SDX01, SDX02) శాటిలైట్లను రోదసిలో ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఛేజర్ అనేది.. టార్గెట్ శాటిలైట్‌ని టార్గెట్ చెయ్యాల్సి ఉంటుంది. అంటే.. టార్గెట్ శాటిలైట్‌కి ఉండే.. డాకింగ్ పరికరాన్ని… ఛేజర్ శాటిలైట్ వెళ్లి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కరెక్టుగా జరిగితే.. ఈ మిషన్ గ్రాండ్ సక్సెస్ అయినట్లే.
ఈ రెండు శాటిలైట్స్ భూమికి 476 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్య (Circular orbit)లో పరిభ్రమిస్తాయి. అంతరిక్షంలో రెండు స్పేస్‌క్రాఫ్ట్‌ల (Spacecrafts)ను ఒకదానితో ఒకటి కలపడం (డాకింగ్), విడదీయడం (అన్‌డాకింగ్) వంటి క్లిష్టమైన టెక్నాలజీలను విజయవంతంగా పరీక్షించడమే SpaDEx మిషన్ ముఖ్య ఉద్దేశం.
అగ్రరాజ్యాల సరసన భారత్:
ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో వ్యోమనౌకలను డాకింగ్ చేయగల సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారతదేశం అవతరిస్తోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాయి. ఈ డాకింగ్ ప్రస్తుతానికి జరపట్లేదు. వారం తర్వాత నిర్వహిస్తామని ఇస్రో తెలిపింది. అప్పటివరకూ శాటిలైట్లు అంతరిక్షంలో ప్రయాణిస్తాయి. ఆ తర్వాత డాకింగ్, అన్ డాకింగ్ జరుపుతారు.
డాకింగ్ అంటే:
ప్రస్తుతం అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా (NASA) తన అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ నిర్వహిస్తోంది. భూమి నుంచి వ్యోమగాములు స్పేస్‌షిప్‌లో పైకి వెళ్లినప్పుడు.. అంతరిక్ష కేంద్రం డాకింగ్ పరికరానికి ఈ స్పేస్‌షిప్ కనెక్ట్ కావాల్సి ఉంటుంది. అది కరెక్టుగా కనెక్ట్ అయితేనే.. వ్యోమగాములు.. స్పేస్‌షిప్ నుంచి.. అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగలరు.
అంతరిక్ష కేంద్రం కోసం:
ఇస్రో త్వరలో అంతరిక్షంలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. దీన్ని నిర్మించేందుకు.. తరచుగా.. వ్యోమగాములు.. రోదసిలోకి వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసే.. డాకింగ్ మిషన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లాలంటే.. ఈ డాకింగ్ అనేది పర్ఫెక్టుగా జరపాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇస్రో.. ఇవాళ ఈ ప్రయోగం చేసింది.
డాకింగ్ కష్టమా?
అంతరిక్షంలో డాకింగ్ అనేది అత్యంత కష్టమైన అంశం. అంతరిక్ష కేంద్రానికి ఉండే డాకింగ్ గదికి… స్పేస్ షిప్ డాకింగ్ పరికరం పర్ఫెక్టుగా సెట్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం పక్కకు జరిగినా.. డాకింగ్ అవ్వదు. ఒక్కోసారి డాకింగ్ చేసేటప్పుడు ప్రమాదం కూడా జరగొచ్చు. అలా జరిగితే.. కొన్ని ఫ్లూయిడ్లు లీక్ అవుతాయి. అలా లీక్ అయితే.. వ్యోమగాములు.. స్పేష్ స్టేషన్ లోకి వెళ్లలేరు. దాంతో.. సమస్య అంతకంతకూ పెద్దదవుతుంది. తిరిగి వ్యోమగాములు భూమికి వచ్చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద సమస్య కాగలదు. ఒక్కోసారి మిషన్ ఫెయిల్ అవ్వగలదు కూడా. అందుకే డాకింగ్ అనేది అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో కీలక అంశంగా ఉంది.