IT News: ఉద్యోగాల బాజా మోగించిన ఇన్ఫోసిస్.. సంతోషంలో టెక్ ఫ్రెషర్స్..
Infosys Hiring: దేశీయ ఐటీ రంగంపై అలుముకున్న అస్థిర మబ్బులు వీడుతున్నట్లు ప్రస్తుత త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫలితాలను ప్రకటించిన టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ బలమైన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి.
ఈ క్రమంలో చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న జాబ్ మార్కెట్లో పెద్ద కోలాహలం కొనసాగుతోంది.
దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తన మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో మార్కెట్ అంచనాలకు మించి బలమైన లాభదాయకతను కంపెనీ నమోదు చేసింది. అలాగే వ్యాపారంలో కొనసాగిన గడ్డు పరిస్థితులతో క్యాంపస్ హైరింగ్ నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే 2025 సంవత్సరంలో కొత్తగా ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్ణయించింది.
2025 ఆర్థిక సంవత్సరానికి 15,000-20,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు తెలిపింది. దీంతో రాబోయే కళాశాల గ్రాడ్యుయేట్‌లకు ఆశలను కలిగిస్తోంది. వాస్తవానికి క్యాంపస్ హైరింగ్ నిర్వహించటానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర మార్గాల్లో ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 11,900 మంది ఫ్రెషర్‌లను నియమించుకుంది. దీనికి ముందు FY23లో 50,000 మంది ఫ్రెషర్‌ల నుంచి 76 శాతం క్షీణత కనిపించింది. గడచిన కొన్ని త్రైమాసికాలుగా తాము చురుకైన హైరింగ్ బేస్‌కి మారినట్లు జూలై 18న జరిగిన కంపెనీ మొదటి త్రైమాసిక ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా వెల్లడించారు.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 2000 మంది ఉద్యోగుల క్షీణతను చూసింది. వాస్తవానికి ఇది అంతకు ముందలి త్రైమాసికం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 85 శాతం మందిని వివిధ ప్రాజెక్టుల్లో వినియోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే వ్యాపార వృద్ధికి అనుగుణంగా కొత్త హైరింగ్స్ ఉంటాయని జయేష్ సంఘ్‌రాజ్కా పేర్కొన్నారు. తాము వృద్ధిని ఎలా చూస్తాము అనేదానిపై ఆధారపడి ఈ సంవత్సరం 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించాలని చూస్తున్నట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో భారత ఐటీ సేవల రంగంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ FY25లో దాదాపు 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మెుదటి త్రైమాసికంలో దాదాపు 11,000 మంది ట్రైనీలను నియమించుకున్నట్లు కంపెనీ ఇటీవల తన క్యూ1 ఆర్థిక ఫలితాల్లో ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస్ హెడ్ కౌంట్ వరుసగా ఆరో త్రైమాసికంలో గతంతో పోల్చితే 1908 మేర తగ్గుదలను చూసింది. అయితే మార్చి కాలంతో పోలిస్తే టీసీఎస్ మొత్తం హెడ్‌కౌంట్ 1,759 వరుసగా పడిపోయింది. HCLTech హెడ్‌కౌంట్ వరుసగా 8,080 తగ్గగా, LTIMindtree 284 మంది ఉద్యోగులను క్యూ1లో కొత్తగా జోడించింది.