జీవనశైలి సంబంధిత వ్యాధులలో రక్తపోటు సమస్య కూడా ఒకటి. ఒకప్పుడు వందల్లో ఒకరిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది.
తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం ఇలా లో బీపీ లేదా హై బీపీ రావడానికి కొన్ని కారణాలు. నేటి కాలంలో చిన్న వయసులోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. కానీ దాని తీవ్రతను తక్కువ అంచనా వేయలేము. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే భవిష్యత్తులో గుండెపోటు , మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి . ఇది జీవనశైలి వ్యాధి కాబట్టి కచ్చితంగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ సంవత్సరాలు జీవించగలరు. ఇక ఉప్పు కాకుండా హై బీపీకి కారణమయ్యే కొన్ని ఆహారాల గురించి ఓ లుక్కేద్దాం..
ప్రాసెస్ ఫుడ్
ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్లే ఊబకాయం నుంచి అధిక రక్తపోటు వరకు అనేక ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు నేటితరం. నోటికి రుచిగా ఉంటాయని, తేలికగా కడుపు నింపుకోవచ్చని ప్యాకేజ్డ్ నూడుల్స్, చిప్స్, నమ్కీన్, బిస్కెట్లు, పాస్తా లేదా స్నాక్స్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటాయి. ఇవి హై బీపీకి ప్రత్యక్షంగా కారణమవుతాయి. మీకు అధిక రక్తపోటు సమస్య ఉన్నా లేకపోయినా కూడా వీటిని అధికంగా తీసుకోవడం మానేస్తేనే ఆరోగ్యానికి మంచిది.
ఫ్రై ఫుడ్స్
అధిక రక్తపోటుతో బాధపడేవారు వేయించిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. పకోడీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు తినడానికి ఎంత రుచిగా ఉన్నా ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. వీటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉండటం వల్ల తిన్న వెంటనే రక్తపోటు పెరుగుతుంది. వీటిలో ఉప్పు, పిండి, నూనె, సుగంధ ద్రవ్యాలు వంటి పదార్థాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ బీపీని పెంచేవే.
ఊరగాయలు, పాపడ్
ఊరగాయలను ఇంట్లో తయారు చేసినా లేదా మార్కెట్లో కొన్నా వీటిలో నూనె, ఉప్పు లేదా పులుపు కచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఇవన్నీ రక్తపోటుకు దారితీసేవే. ముఖ్యంగా మీరు ప్రతిరోజూ ఊరగాయలు తింటుంటే శరీరంలో బీపీ హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. ఇక పాపడ్‌లో సోడియం స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం కాదని కొద్దికొద్దిగా పాపడ్ తిన్నప్పటికీ క్రమంగా రక్తపోటు పెరిగే అవకాశముంది.
తీపి పదార్థాలు
ఉప్పు ఎక్కువగా తినడం వల్లే రక్తపోటు పెరుగుతుందని ప్రజలు తరచుగా అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. నిజానికి మీరు చాక్లెట్, స్వీట్లు లేదా ఏదైనా ఇతర బేకరీ వస్తువులు వంటి తీపి పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని వల్ల సిరలు బిగుసుకుపోయి బీపీ పెరగడం ప్రారంభమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజలు ఎక్కువ స్వీట్లు తింటే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
































