YS Jagan: బిల్లుల గోల పడలేక బెంగళూరుకు జగన్‌ జంప్‌

www.mannamweb.com


ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా స్వస్థలం పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పెండింగ్‌ బిల్లుల గోల తలపోటుగా మారడంతో తన పర్యటన కుదించుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు.

సతీమణి భారతినీ వదలని కార్యకర్తలు, నాయకులు
సొంత ఇలాకాలో మూడ్రోజుల పర్యటనలో గందరగోళం
వైకాపాకు రాజీనామా చేస్తామని 10 మంది కౌన్సిలర్ల హెచ్చరిక

కడప: ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా స్వస్థలం పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పెండింగ్‌ బిల్లుల గోల తలపోటుగా మారడంతో తన పర్యటన కుదించుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. ఐదేళ్లుగా ఎన్నడూలేని విధంగా పులివెందుల నివాసంలో మూడు రోజుల పాటు గడపడంతో పాటు ప్రజలను కలుసుకునే అవకాశం ఇచ్చారు. ఎక్కువమంది తమకు వైకాపా ప్రభుత్వ హయాంలోని బిల్లుల బకాయిల గురించి గట్టిగా ప్రస్తావించారు. 2019కి ముందు తెదేపా హయాంలో చేసిన పనులకు బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడూ అలాగే జరిగితే తమ పరిస్థితి ఏమిటని జగన్‌ ఎదుట నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) కింద 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రతిపాదించారు. నిజానికి వాటిలో చాలావరకు ప్రజలకు ఉపయోగంలేనివే ఉండగా.. చేపట్టినవీ నాసిరకంగా ఉండడం, పనులు చేయకుండానే బిల్లులు పెట్టడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను మచ్చిక చేసుకోవడానికి ‘పాడా’ నిధులను ఇష్టానుసారం పంచి పెట్టారు. వీటితో పాటు ఉపాధి హామీ నుంచి రూ. 26 కోట్ల నిధులను మట్టి రోడ్ల కోసం పంచిపెట్టి పనులు చేయకున్నా బిల్లులు చేశారు. బడా నేతలకు మాత్రం ముందే అక్రమంగా చెల్లించారు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్లు తీసుకుని బిల్లుల చెల్లింపులో పక్షపాతానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వైకాపా సాధారణ కార్యకర్తలు, నేతలకు చాలా వరకు బకాయిలు నిలిచిపోయాయి. పనుల్లో అక్రమాలు జరిగినందున ‘పాడా’పై విచారణ చేపట్టాలని, తెదేపా నేతలు కూటమి ప్రభుత్వం వద్ద పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా పాడా ఓఎస్డీ అనీల్‌కుమార్‌రెడ్డిని రిలీవ్‌ చేయకుండా కొత్త ప్రభుత్వం అక్కడే ఉంచింది. ఒకవేళ విచారణ జరిగితే తమ పరిస్థితి ఏమిటని పెండింగ్‌ బిల్లులున్న నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

పెద్దిరెడ్డి కంపెనీకి ఎలా ఇచ్చారు?
పులివెందుల పురపాలక సంఘానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు భారతి వద్ద తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఆమె సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. పదిమంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. సీఎఫ్‌ఎంఎస్‌ కింద అప్‌లోడ్‌ చేసిన మేరకు రూ. 230 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నడుస్తున్న పనులు, ఇంకా బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సినవి మరో రూ. 100 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. వాటికి పూచీ ఇవ్వాలంటూ జగన్‌ను బాధితులు నిలదీయడంతో పాటు బడా నేతలకు బిల్లులిచ్చి తమను మోసం చేశారంటూ ఆరోపించారు. కొందరైతే కాలేటివాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి, పులివెందుల వైద్య కళాశాల నిర్మాణ గుత్తేదారుకు ఎన్నికల తరుణంలోనూ బిల్లులిచ్చారంటూ.. తమకే అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వరుసగా మూడు రోజుల పాటు బిల్లుల గోలతో అసహనానికి గురైన జగన్‌.. ‘ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా?’ అంటూ మండిపడినట్లు సమాచారం. చివరకు ఐదు రోజుల పాటు పులివెందులలో గడపాలనుకున్న జగన్‌ మూడు రోజులతో సరిపెట్టుకుని సతీసమేతంగా సోమవారం హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లిపోయారు.