జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం.. రామ్మోహన్ సంచలన కామెంట్స్

www.mannamweb.com


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు వెళుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు వెళుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు దూరం పెట్టారన్నారు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడ రాష్ట్ర ప్రజలకు ప్రమాదం ఉందన్నారు.

భయపడవలసింది జగన్ కాదు, రాష్ట్ర ప్రజలు అని అన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని… అయినా పద్ధతి మార్చుకోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వరదలపై జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుడమేరు కాలువకి గేట్లు ఎత్తేసామని.. అమరావతి పూర్తిగా మునిగిపోయిందని అంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలని ఆలోచన జగన్‌కు రావడం దురదృష్టకరమన్నారు. వరదల్ని రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు.

విపత్తు పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు డ్రోన్లు వినియోగించి బాధితులను ఆదుకున్నారన్నారు. వరదలు వచ్చినప్పుడు మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్ల ద్వారా సహాయం అందించామన్నారు. ఇంతగా సహాయం చేస్తున్నా జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నష్టం అంచనా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జాతీయ విపత్తు అంశంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు.

చంద్రబాబుపై ప్రశంసలు..

మరోవైపు సీఎం చంద్రబాబుపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయ లబ్దికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు విసుగుచెంది బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియాలో సహాయ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని… అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోందని… కేంద్రం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.