జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది.
పోలింగుకు ముందు రూ.14,165 కోట్ల పంపిణీకి స్కెచ్
కేంద్ర ఎన్నికల సంఘం ముకుతాడు
సీఈసీ ఉత్తర్వులను ఒక రోజు నిలిపివేసిన హైకోర్టు సింగిల్ బెంచి
ఎన్‌ఓసీ కోసం మళ్లీ ఈసీకి సీఎస్ వినతి
సీఎస్‌కు అనేక ప్రశ్నలు సంధిస్తూ ఈసీ ఘాటు లేఖ
జనవరి నుంచి ఆర్థిక లెక్కలపై ఆరా
పోలింగ్ అయ్యేవరకు చెల్లింపులు నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. ఇక్కడ పన్నిన పన్నాగాలన్నింటినీ ఈసీ తెలుసుకుని అడ్డుకుంది. నిజానికి జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సొమ్మును అప్పట్లోనే పంచేసినట్లు హడావుడి చేసేశారు. ఆ నిధులేవీ ఖాతాలకు చేర్చలేదు. ముందస్తు వ్యూహంతోనే పెండింగులో ఉంచి, సరిగ్గా పోలింగుకు ముందు పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తే తమకు ఈవీఎంలలో ఓట్లవర్షం కురుస్తుందని వ్యూహం పన్ని.. వాటిని చెల్లించకుండా ఆపేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా.. అవి పాత పథకాలేనని, వాటి చెల్లింపులు చేపడతామంటూ స్క్రీనింగ్ కమిటీలో ఆమోదింపజేసుకుని ఈసీ ఆమోదానికి ప్రయత్నించారు. సీఎం జగన్‌కు నమ్మినబంటులా ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ స్వామిభక్తి ప్రదర్శిస్తూ, పావులు కదుపుతూ వచ్చారు. గురువారం రాత్రి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5 గంటలకే కార్పొరేషన్లలో అధికారులందరినీ రప్పించారు. బిల్లుల చెల్లింపులకూ ఏర్పాట్లు చేసేశారు. ఇంతలో ఈసీ నుంచి సీఎస్‌కు ఫోన్ వచ్చింది. ముందుకు వెళ్తే తీవ్రచర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో చెల్లింపులకు బ్రేక్ పడింది. ఈసీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం సీఎస్‌కు ఓ లేఖ వచ్చింది. జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థికపరిస్థితి, చెల్లింపుల వివరాలతో పాటు మరిన్ని కఠినమైన ప్రశ్నలు సంధించారు. దీంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చివరకు శుక్రవారం రాత్రి ఈసీ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పోలింగు పూర్తయ్యేవరకు పథకాల సొమ్ములు చెల్లించాల్సిన అత్యవసరం ఏమీ లేదంది. అప్పటివరకు చెల్లింపులు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎప్పుడైనా చెల్లించేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
ఇప్పటివి కానే కావు
జనవరి 23న ఆసరా కింద ఇవ్వాల్సిన రూ.6,394 కోట్లు, ఫిబ్రవరి 28న లబ్ధిదారులకు జమకావాల్సిన వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా నిధులు రూ.78.53 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద మార్చి 1న ఇవ్వాల్సిన రూ.708.68 కోట్లు, మార్చి 6న ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ రూ.1,294 కోట్లు, మార్చి 7న జమచేయాల్సిన వైఎస్సార్ చేయూత రూ.5,60.49 కోట్లు, మార్చి 14న ఇవ్వాల్సిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం రూ.629.37 కోట్లు ఏకమొత్తంగా ఇప్పుడు చెల్లించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్నారు. అందుకే నాడు నిధులున్నా చెల్లించలేదనే విషయం ఈసీ ప్రశ్నలు, అధికారుల సమాధానాలతో స్పష్టంగా బయటకొచ్చింది.
ఇన్నాళ్లూ ఆగి ఇప్పుడు చెల్లింపులా.. కుదరదు
ఇన్నాళ్లూ ఆపి, ఇప్పుడు పంపిణీ చేయాలని చూస్తున్న విషయాన్ని వివిధ వర్గాల ద్వారా ఈసీ తెలుసుకుంది. పోలింగ్ తర్వాతే చెల్లింపులు చేపట్టాలని, అంతవరకు నిలిపివేయాలని తొలుత మే 9న సీఎస్‌కు లేఖ రాసింది. ఆయన నుంచి కొన్ని వివరాలు కోరింది. చాన్నాళ్ల ముందే ఈ స్కీంల కోసం బటన్ నొక్కినా వెంటనే ఎందుకు ఖాతాల్లో జమచేయలేదో చెప్పాలని అడిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా దీనిపై నివేదిక పంపించాలని కోరింది. ఈ నేపథ్యంలో జగన్ బృందంలో స్లీపర్‌సెల్స్‌లా పనిచేసే ప్రతినిధులు వేగంగా కదిలారు. అప్పటికే ఈ విషయం హైకోర్టులో విచారణలో ఉంది. గురువారం హైకోర్టు సింగిల్‌జడ్జి ముందు విచారణకు వచ్చింది. ఈసీ ఆదేశాలను ఒకరోజు నిలుపుదల చేస్తూ రాత్రిపూట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు చెల్లింపులు జరపరాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గురువారం రాత్రి నుంచే ఈ చెల్లింపులకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలన్నీ వివిధ కార్పొరేషన్ల కింద అమలవుతున్నాయి. ఆయా కార్పొరేషన్ల ఎండీలు, ఇతర సిబ్బందిని శుక్రవారం ఉదయమే వారి కార్యాలయాలకు పిలిపించారు. ఇంతలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు అధికారులందరికీ అందడంతో, వాటిని చదివి కొంత సందేహంలో పడ్డారు.
మరోవైపు… శుక్రవారం మధ్యాహ్నంలోపు రూ.14,125 కోట్ల చెల్లింపులపై ఈసీ కోరిన వివరణకు సీఎస్ లేఖ రాయాల్సి ఉంది. హైకోర్టు సింగిల్‌జడ్జి ముందస్తు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ ఈ పథకాల సొమ్ము జమచేసేందుకు ఎన్‌ఓసీ ఇవ్వాలని కోరుతూ సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి లేఖ రాశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టు డివిజన్ బెంచికి వెళ్లారు. అక్కడ విచారణ చేపట్టారు. ఇంతలో ఈసీ నుంచి సీఎస్‌కు ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదని మౌఖికంగా ఆదేశించారు. ఆనక సీఎస్‌కు ఈసీ లేఖ రాసింది. తాము ఎన్‌ఓసీ ఇవ్వలేదని, న్యాయస్థానం కూడా నిధులు చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని ప్రస్తావిస్తూ కొన్ని ఘాటైన ప్రశ్నలు సంధించింది.
సెర్ప్ కార్యాలయానికి ఉన్నతాధికారులు
ఈ ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రావత్, సత్యనారాయణ సెర్ప్ కార్యాలయానికి చేరుకుని హడావుడిగా ఫైళ్లు తిరగేసి సమాధానాలు సిద్ధం చేశారు. ఈసీకి ఆయా అంశాలపై శుక్రవారం మధ్యాహ్నానికి సీఎస్ సమాధానం పంపారు. తర్వాత శుక్రవారం రాత్రి ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. పోలింగు పూర్తయ్యేవరకూ ఎలాంటి చెల్లింపులూ చేపట్టవద్దని స్పష్టంచేసింది. ప్రభుత్వం వద్ద నిధులున్నా జనవరి-మార్చి మధ్య ఈ చెల్లింపులు జరపలేదని గుర్తించింది.
ఈసీ ఉత్తర్వులు ఇలా..
- జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థికపరిస్థితి బాగుంది. ఈ పథకాలకు నిధులు జమ చేసేందుకు అవసరమైన మొత్తాలు ఉన్నాయి. నిధులు లేకపోవడం వల్ల ఒకేసారి చెల్లించాల్సి వస్తోందన్న వాదన సరైంది కాదు.
- ఇంతకుముందు సంవత్సరాల్లో బటన్లు నొక్కిన.. నిధులు జమచేసిన సమయాన్ని చూస్తే ఎప్పుడూ ఇలా మే నెలలో నిధులిచ్చిన దాఖలాలు లేవు.
- డీబీటీ పథకాల్లో ఇప్పటికిప్పుడు నిధులు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి లేదు. పోలింగుకు ముందు కానీ, శుక్రవారం గానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
- పోలింగ్ తర్వాత ఎప్పుడైనా నిధులు వేయవచ్చు.
అధికారుల ఉక్కిరిబిక్కిరి
శుక్రవారం ఉదయం సీఎస్‌కు ఈసీ రాసిన లేఖలో ఘాటైన ప్రశ్నలు సంధించింది.
- ఆర్థిక పరిస్థితుల వల్ల ఇన్నాళ్లు చెల్లింపులు చేయలేదన్నారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గణాంకాలన్నీ చెప్పండి
- ఇప్పటివరకు పథకాలకు నిధులు చెల్లించే అవకాశం లేనప్పుడు… ఒకేసారి పోలింగుకు ముందు చెల్లించేలా నిధులు ఎలా వచ్చాయి?
- ఐదేళ్లలో ఈ పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్లు నొక్కారు? ఆ సొమ్ము లబ్ధిదారులకు ఎప్పుడు వెళ్లింది? పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మధ్యలో ఇంత తేడా ఉన్నట్లు గతంలో కనిపించలేదు.
- హైకోర్టులో ఈ నిధుల కోసం పిటిషన్ దాఖలు చేసినవారు ఈ పథకాల లబ్ధిదారులేనా?
- లబ్ధిదారులకు శుక్రవారం ఆ సొమ్ము చెల్లించకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏప్రిల్, మే నెలల్లో కోడ్ వస్తుందని తెలిసినా ఆ నిధులు బదిలీ చేయలేదు. ఇప్పుడు పోలింగుకు ముందే ఆ సొమ్ము జమచేయాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమిటి?
- ఈ పథకాల సొమ్ము ఇప్పుడే పంపిణీ చేయాలని ప్రభుత్వం ముందే నిర్ణయించిందా? అలా అయితే అందుకు ఆధారాలు, డాక్యుమెంట్లు పంపండి.
ఈ ప్రశ్నలకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.