వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు తన కారు కింద పడి చనిపోతే, దానికీ సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వితండవాదం చేశారే తప్ప తన పొరపాటు వలన ఓ వృద్ధుడు చనిపోయాడనే బాధ ఏ కోశాన్నా కనపడలేదు.
యధారాజ తధాప్రజా అన్నట్లు వైసీపీ నేతలు, వారి మీడియా కూడా సింగయ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగానే అభివర్ణించారు.
తన బలప్రదర్శనతో ప్రభుత్వాన్ని, పోలీసులను జగన్ భయపెట్టాలనుకుంటే, పోలీసులు ఆయనతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. సింగయ్య మృతికి కారణమైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారుని కూడా తీసుకుపోయారు.
అప్పుడు జగన్‌కి తన పరిస్థితి అర్దం అయ్యింది. వెంటనే ముఖ్య నేతలతో తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశమయ్యి ఈ కేసుని, ప్రభుత్వాన్ని ఏవిదంగా ఎదుర్కోవాలో చర్చించి వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేశారు.
జగన్‌తో పాటు నోటీసులు అందుకున్న వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీ, జగన్ పీఏ నాగేశ్వర రెడ్డి, డ్రైవర్ రమణా రెడ్డి అందరూ హైకోర్టులో పిటిషన్స్ వేశారు.
ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని, కనుక తమపై నమోదు చేసిన ఈ కేసుని కొట్టివేయాలని క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే జగన్ రెంటపాళ్ళ పర్యటనకు వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతివ్వగా వేలాదిమందిని వెంటపెట్టుకొని ఊరేగింపుగా వచ్చారు. కనుక రేపు విచారణలో న్యాయమూర్తి మొట్ట మొదట అడిగే ప్రశ్న ఇదే! దానికి జగన్ వద్ద సంతృప్తికరమైన సమాధానం లేదు కనుక మొట్టికాయలు ఎలాగూ తప్పవు. అయినా పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరవ్వాలంటూ నోటీస్ ఇవ్వక ముందే అప్పుడే కోర్టుకి పరుగు తీయడం దేనికి? రప్పా రప్పా నరుకుతామన్నారుగా?
































