YS Jagan: వినుకొండలో పరామర్శ తర్వాత జగన్ సంచలన ప్రకటన

www.mannamweb.com


అమరావతి/పల్నాడు జిల్లా: వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన..

పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చుమీరాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కోర్టుకు వెళ్తాం..!

రషీద్‌ హత్యకేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. రాజకీయ కక్షలతోనే రషీద్‌ హత్య జరిగిందని.. అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే, ఎంపీల పైనా రాళ్లు వేశారని మీడియాకు వివరించారు.

ఏమైనా చేయొచ్చా..?

‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. లా అండ్ ఆర్డర్ లేదు. తెలుగుదేశం వాళ్లు ఎవరినైనా కొట్టచ్చు.. చంపొచ్చా..? వాళ్లు ఏ అరాచకం చేసినా పోలీసులు పట్టించుకోరా..? పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 45 రోజుల్లో 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు. 490 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవికాక వెయ్యికిపైగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నవి ఇవే. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. టీడీపీ నేతలు దాడులు, హత్యలు చేస్తున్నారు. అందరి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు’ అని కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలే చేశారు.

సంచలన ప్రకటన..

రషీద్ హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని.. పనికిమాలిన కారణాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తామని మాజీ సీఎం ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు.