టీడీపీ , బీజేపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తన పక్క జిల్లా అయిన కడపలో సైతం ఆయన వేలు పెట్టారు.కడప జిల్లాలోని రాయల సీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఫ్లైయాష్ రావాణా విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వార్ మొదలైంది. ఫ్లై యాష్ జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది.
తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలోనే ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ పట్టు బడుతున్నారు. కానీ, తాడిపత్రి నియోజక వర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి జేసీ వర్గీయులు ఫ్లై యాష్ ను తరలిస్తున్నారు.దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఫ్లైయాష్‌పై రోజుకు రూ. 2 నుంచి 5 లక్షల రూపాయిల వరకు చేతులు మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో దీనిపై ఇరు నేతలు కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. దీంతో ఈ పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరింది. కూటమి నాయకులు సఖ్యతగా ఉండాలని చెబుతుంటే రోడ్డున పడతారా? అంటూ వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఆయన జేసీ, ఆదినారాయణరెడ్డిలను స్వయంగా అమరావతికి కలవాలని తెలిపారు. చంద్రబాబు పిలుపుతో ఆది నారాయణరెడ్డి అమరావతికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. చంద్రబాబు ఎలాగూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణకే తన మద్దతు ప్రకటిస్తారనే ఉద్దేశంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తనకు జ్వరంగా ఉందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. మరి వీరి మధ్య వివాదానికి చంద్రబాబు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.