దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తొలి విడత జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా నోటిఫికేషన్ వెల్లడించింది. ఇక గతేడాది జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా, ఈసారి 2 రోజులు ముందుకు పరీక్ష తేదీ జరిపారు. ఈసారి పరీక్షల ఫలితాల ప్రకటన తేదీలను కూడా ఎన్టీయే ప్రకటించడం విశేషం. ఇక ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే NTA స్పష్టం చేసింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎవరైనా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు 3 రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేస్తారు. జనవరి 22 నుంచి జనవరి 31 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12న ఫలితాలు ప్రకటిస్తారు. రెండో విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరుగుతాయి. జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు.
ఈసారి జేఈఈ మెయిన్ పరీక్షలో కీలక మార్పు..
జేఈఈ మెయిన్ పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష 300, పేపర్ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. ఇక్కడి వరకు ఎప్పటి మాదిరిగానే జరుగుతుంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను మాత్రం ఈసారి కొనసాగించరు. అంటే ఈ విభాగంలో ఛాయిస్ విభాగాన్ని పూర్తిగా తొలగించి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. గతంలో జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు వచ్చేవి. అయితే కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వడం ప్రారంభించారు. జేఈఈ మెయిన్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు మూడేళ్ల నుంచి ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. అయితే సెక్షన్ బీలో మాత్రం 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. మిగతా 5 ఛాయిస్ ఇచ్చేవారు. అంటే సెక్షన్-బిలో ఈసారి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారన్నమాట. గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్ ఉండదు. రెండు సెక్షన్లలో మైనస్ మార్కులుంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు అయితే 1 మార్కు చొప్పున మైనస్ చేస్తారు. ఎన్‌టీఏ స్కోర్ కోసం తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకు మించి విద్యార్థులకు సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులను చూస్తారు.