JEE Main Exam: జేఈఈ మెయిన్‌ ప్రశ్నల్లో.. కొన్ని అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత!

గత పరీక్షల మాదిరిగానే.. రెండు షిఫ్ట్‌లలోనూ మ్యాథమెటిక్స్‌ క్లిష్టత స్థాయి ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి.


ఫిజిక్స్‌ మాత్రం క్లిష్టంగా ఉంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే జనవరి 28న మొదటి షిఫ్ట్‌ కష్టంగా ఉందని అంటున్నారు. కొన్ని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఫిజిక్స్‌లో ఆప్టిక్స్‌ నుంచి 3 ప్రశ్నలు, ఫ్లూయిడ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. మ్యాథమెటిక్స్‌లో వెక్టార్స్‌..3డి, కానిక్స్‌ నుంచి మూడు ప్రశ్నల చొప్పున మాట్రిసెస్‌ అండ్‌ డిటర్మినెంట్స్, సిరీస్, డీఈఎఫ్‌ ఇంటిగ్రేషన్‌ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ప్రశ్నలు అడగడంతో బోర్డు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

పిరియాడిక్‌ టేబుల్, బేసిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నల చొప్పున, అటామిక్‌ స్ట్రక్చర్, ఫినాల్‌ – ఈథర్‌-ఆల్కహాల్, కెమికల్‌ బాండింగ్‌ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. రెండో షిఫ్ట్‌లో కూడా మ్యాథమెటిక్స్‌ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. సుదీర్ఘమైన ప్రశ్నలు, కాలిక్యులేషన్స్‌ అవసరమైన ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ సులభంగా, ఫిజిక్స్‌లో సులభం, ఓ మాదిరి క్లిష్టత గల ప్రశ్నలు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. రెండు షిఫ్ట్‌లలోనూ కొన్ని టాపిక్స్‌ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్‌లో ఏరియాస్, మాట్రిసెస్‌ అండ్‌ డిటర్మినేషన్స్, కానిక్స్, వెక్టార్‌ అండ్‌ 3డి జామెట్రీ, కానిక్స్, ఇంటెగ్రల్‌ కాలక్యులస్‌కు ఎక్కువ వెయిటేజీ కనిపించింది.

కెమిస్ట్రీలో కోఆర్డినేట్‌ కాంపౌండ్, అటామిక్‌ స్ట్రక్చర్, బేసిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కెమికల్‌ బాండింగ్‌ టాపిక్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, థర్మో డైనమిక్స్, ఆప్టిక్స్, ఫ్లూయిడ్‌ డైనమిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్‌ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో కొన్ని ప్రశ్నలు కాసింత తికమక పెట్టేలా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష స్థాయిలో ఉన్నాయని జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్ట్‌ నిపుణులు ఎం.ఎన్‌. రావు తెలిపారు.

ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్డ్‌గా డైరెక్ట్‌ కొశ్చన్స్‌ లేకపోవడం విద్యార్థులను కొంత ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి.