వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఏం చేసినా సెన్సేషనల్‌గా మారుతుంది. ఆయన ఏ రంగంలో అడుగుపెడితే అక్కడ సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు.
టెలికం రంగంలో ఆయన రాకతో వచ్చిన విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి అంబానీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన సొంత క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. బిట్‌కాయిన్‌లాగే ఆయన ఒక కాయిన్ తీసుకొచ్చారు. దాని పేరు జియో కాయిన్. ఒక్కసారిగా అంతటా చర్చనీయాంశంగా మారిందీ కాయిన్. ఈ నేపథ్యంలో అసలు జియో కాయిన్ అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్? అనేది ఇప్పుడు చూద్దాం..
పక్కా ప్లానింగ్‌తో..!
క్రిప్టోకరెన్సీపై చాన్నాళ్ల కిందే కన్నేశారు ముఖేశ్ అంబానీ. ఇందులోకి అడుగుపెట్టాలని ఆయనే ఎప్పుడో నిర్ణయించుకున్నారు. తనకంటూ ఓ స్పెషల్ కరెన్సీ ఉండాలని భావించారు. అందులో భాగంగానే ఒక టీమ్‌తో చాలా కసరత్తులు చేసి ఆఖరుకు జియో కాయిన్‌ను రూపొందించారట. దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అవసరం. అందుకే పాలీగాన్ నెట్‌వర్క్ కంపెనీతో ఆయన భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాలీగాన్ ల్యాబ్ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో అనౌన్స్ చేసింది. మన దేశంలో క్రిప్టో కరెన్సీ వాడకం, డిజిటల్ ఎకానమీని పెంచడంలో జియో కాయిన్ కీలక పాత్ర పోషించనుందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఎలా వాడాలి?
రిలయన్స్ సంస్థ అందించే జియో మార్ట్ (ఈ-కామర్స్), జియో ప్లే (డిజిటల్ ట్రాన్సాక్షన్స్), జియో క్లౌడ్ (డేటా స్టోరేజ్) లాంటి ఇతర సేవలకు జియో కాయిన్‌ను టోకెన్‌లా వాడుకోవచ్చనేది అంబానీ ఆలోచన. అయితే సొంత క్రిప్టో కరెన్సీని అంబానీ ముందుకు ఎలా తీసుకెళ్తారు? జియో కాయిన్‌తో ఇతర జియో సేవలకు ఆయన ఎలా అనుసంధానం చేస్తారనే సందేహం రావొచ్చు. రీసెంట్‌గా జియో స్పియర్ అనే వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టారు అంబానీ. క్రోమ్, సఫారీ బ్రౌజర్‌కు పోటీగా దీన్ని తీసుకొచ్చారు. ఈ స్పియర్‌లోకి వెళ్లి బ్రౌజ్ చేస్తే జియో కాయిన్ రూపంలో ఫ్రీగా రివార్డ్ పాయింట్లు ఇస్తారట. జియో రీఛార్జ్ చేసుకోవడానికి అలాగే రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్‌లో పెట్రోల్ ఫిల్లింగ్ లాంటి వాటికి ఈ కాయిన్స్‌ను వాడుకోవచ్చని సమాచారం. ఇలా జియో కాయిన్‌తో సమాంతరంగా ఒక నూతన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖేశ్ అంబానీ. అయితే ఈ క్రిప్టో కరెన్సీ విస్తరణకు కనీసం 4 నుంచి 5 ఏళ్లు పట్టొచ్చనేది నిపుణుల అభిప్రాయం.