వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు ట్రంప్‌తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం చెందడంతో వైదొలగక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి’ అని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది 59 ఏళ్ల హారిస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమే సురక్షిత అభ్యర్థి అవుతారనేది వారి అంచనా. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్జ్‌కెర్ బరిలో నిలిచే అవకాశముంది. మిషిగన్ గవర్నర్ విట్మర్ పేరు తెరపైకి వచ్చినా తాను పోటీలో లేనని ఆమె ప్రకటించారు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు.‘రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని నాకు గట్టి కోరిక ఉన్నా పార్టీ, దేశ ప్రయోజనాల కోసం వైదొలగుతున్నా. అధ్యక్షుడిగా నా బాధ్యతలను పూర్తి చేయడంపై దృష్టి పెడతా’ అని లేఖలో బైడెన్ పేర్కొన్నారు. 81 ఏళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లో తడబడ్డారు. దీంతోపాటు ట్రంప్‌తో జరిగిన చర్చలో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం కొవిడ్‌తో ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95శాతం డెమోక్రాట్ ప్రతినిధులు బైడెన్‌కు మద్దతు పలికారు. ఆయన అనూహ్యంగా వైదొలగడంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి రావొచ్చు. వాస్తవానికి ఇలా అభ్యర్థి అర్ధాంతరంగా వైదొలిగితే ఏం చేయాలన్న విషయంపై ఎవరికీ అవగాహన లేదు. ఇదే తొలిసారి కావడంతో ఏం చేయాలన్న దానిపై రానున్న కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన అనంతరం ఆయన స్పందించారు. కమలా హారిస్ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని స్పష్టం చేశారు.
బైడెన్ లేఖలో ఏముందంటే..
‘దేశ నిర్మాణం కోసం చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నాం. వృద్ధులకు చౌకగా ఔషధాలను అందించడం, అమెరికన్లకు వైద్య చికిత్సలను అందుబాటులోకి తేవడం, గత 30 ఏళ్లలో తుపాకుల నుంచి రక్షణకు చట్టాన్ని చేయడం, సుప్రీంకోర్టుకు మొదటి అఫ్రో అమెరికన్‌ను నియమించడం, వాతావరణ మార్పులపై చట్టం తేవడం మన విజయాలు. మీ సహకారంతోనే కరోనాపై విజయం సాధించాం. ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలనేది నా ఉద్దేశం. వచ్చే వారం జాతినుద్దేశించి ప్రసంగిస్తా. నాతోపాటుపని చేసిన కమలా హారిస్‌కు కృతజ్ఞతలు’ అని బైడెన్ లేఖలో పేర్కొన్నారు. బైడెన్ ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో అందరి దృష్టి కమలా హారిస్‌పైనే పడింది. పైగా అధ్యక్షుడు ఆమెకు మద్దతు పలకడం ఉత్కంఠకు కారణమవుతోంది. బైడెన్ అంగీకరించగానే హారిస్ అభ్యర్థి కాబోరు. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థి నిర్ణయమవుతారు. 4,700 మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రతినిధులతోపాటు సూర్ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సిందే.