హైదరాబాద్, కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తి చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వకపోవడం విచారకరమని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. బుధవారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, సుప్రీం కోర్టు తీర్పు, ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి స్థలం కేటాయించాలని సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ తీర్మానించింది. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, సీనియర్ జర్నలిస్టులు షోయబుల్లా ఖాన్, సారంగపాణి, పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని,గత ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకుండా తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. గ్రేటర్ సొసైటీలో ఉన్న దాదాపు 1350 మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఇంటి స్థలం పొందకుండానే చాలా మంది చనిపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పలువురు మంత్రులను కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ స్థలం కేటాయింపునకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ను సాకుగా చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. ప్రత్యామ్నాయ జీవోల ద్వారా జర్నలిస్ట్ సొసైటీలకు స్థలాలు ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి ని కోరారు. అంతకుముందు సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు తీగ వరపు శాంతి, నాగ వాణి, సొసైటీ కోశాధికారి తన్నీరు శ్రీనివాస్, డైరెక్టర్లు యర్రమిల్లి రామారావు, భాస్కర్ రెడ్డి, గజ్జల వీరేశం తదితరులు పాల్గొన్నారు.
































