కేవలం 21 రోజులు.. వాకింగ్.. గాఢ నిద్ర.. ఇలా బరువు తగ్గిన మాధవన్
సినిమా, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు పలువురు నటులు. అలాంటి వారిలో మాధవన్ (R Madhavan) ఒకరు.
ఇటీవల కాలంలో ఆయన ఎంచుకునే కథలు, పాత్రలు వైవిధ్యంగా ఉంటున్నాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఇందులో వయసు మళ్లిన నంబి పాత్ర కోసం పొట్ట కూడా పెంచారు. మళ్లీ ఫిట్‌నెస్‌తో కనపడటానికి తాను పాటించిన డైట్ వివరాలను తాజాగా మాధవన్ పంచుకున్నారు. ఎలాంటి కఠిన వ్యాయామాలు లేకుండా కేవలం సాధారణ ఆహారం, వాకింగ్‌తోనే బరువు తగ్గినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ మాధవన్ చెప్పిన డైట్ ఏంటో తెలుసా?
”బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (intermittent fasting) పాటించా. ఆహారాన్ని తినేటప్పుడు 45-60 సార్లు నమిలి తినేవాడిని. చివరి మీల్‌ను సాయంత్రం 6.45 గంటలకే ముగిసేది. కేవలం వండిన ఆహారాన్నే మాత్రమే తీసుకునేవాడిని. పచ్చి ఆహారం ఏది తీసుకోవాలనుకున్నా మధ్యాహ్నం 3 గంటల కన్నా ముందే ముగించేవాడిని. రాత్రి వీలైనంత త్వరగా నిద్ర పోవడమే కాదు, కలత నిద్ర లేకుండా చూసుకునేవాడిని. ఉదయాన్నే ఎక్కువ సమయం నడవటానికి కేటాయించాను. రాత్రి పడుకునే 90 నిమిషాల ముందే సెల్, టీవీ చూడటం మానేశా. ద్రవాహారం ఎక్కువగా తీసుకునేవాడిని. మరీ ముఖ్యంగా ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలను భాగం చేయడం ద్వారా శరీరంలోని మెటబాలిజం పెరిగి ఆరోగ్యవంతంగా బరువు తగ్గడానికి ఉపయోగపడింది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోలేదు” అని తన 21 రోజుల డైట్ గురించి చెప్పారు.
నంబి పాత్ర కోసం మాధవన్ మారిన తీరును ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. ‘ఉపవాసం చేయడం మంచిదే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి’ అని ఒక నెటిజన్ అభిప్రాయపడగా, ‘నిరంతరం ఆకలితో ఉండటం నిజంగా కఠినమైన చర్యే. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు’, ‘సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు’ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ‘షైతాన్’ మూవీతో బాలీవుడ్‌లో భయపెట్టిన మాధవన్ ప్రస్తుతం ‘అమ్రిక్ పండిట్’, ‘అదృష్టశాలి’, ‘టెస్ట్’, ‘శంకర’, ‘దే దే ప్యార్‌దే 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.