జస్టిన్ ట్రూడో 2015 నుంచి కెనడా ప్రధానమంత్రిగా ఉన్నారు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించారు.
పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకున్న తర్వాత పార్టీ నేత పదవికి, ప్రధాని పదవి రెండింటికి రాజీనామా చేస్తానని చెప్పారు.
తన కుటుంబంతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.
తన విజయానికి కుటుంబం మద్దతే కారణమని చెప్పిన ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని నిన్న రాత్రి డిన్నర్‌లో పిల్లలకు తెలిపారు. అంతర్గత పార్టీ విభేదాలపై దృష్టి పెడితే తాను కెనడియన్లకు ఉత్తమ ఎంపిక కాలేనని ఆయన చెప్పారు
‘అందరి కోసం పాటుపడ్డాం’
తాను ప్రధానిగా 2015లో ఎన్నికైనప్పటి నుంచి కెనడా ఎంతో అభివృద్ధి చెందిందని, తన ప్రభుత్వం కొందరి అభివృద్ధి కోసం కాకుండా అందరి అభివృద్ధి కోసం పాటుపడిందని ఆయన అన్నారు.
పేదరికాన్ని తగ్గించామని, ఎక్కువమంది ప్రజలకు పని కల్పించామని చెప్పారు.
ట్రూడో పదవి నుంచి దిగిపోవాలని పార్టీతోపాటు ఇతరుల నుంచి కూడా డిమాండ్ పెరిగింది.
పార్లమెంటు తిరిగి గాడినపడటానికి కెనడా రాజకీయాల్లో ఉద్రిక్తతలు తగ్గడానికి ఇది సరైన సమయమని ట్రూడో తెలిపారు.
మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ట్రూడో దేశీయంగా, అంతర్జాతీయంగా సంక్లిష్టపరిస్థితులను ఎదుర్కోవడానికి కెనడా పార్లమెంటు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని చెప్పారు.
మరి ఇప్పుడు లిబరల్ పార్టీ నేతగా ట్రూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? మాజీ డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్, మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నే ఈ స్థానానికి పోటీపడేవారిలో ముందున్నారు.
భారత్‌తో దెబ్బతిన్న బంధం
గత కొన్నేళ్లుగా భారత్, కెనడా సంబంధాలు బీటలు వారాయి. కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు గురించి మాట్లాడుతూ ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనడానికి ఆధారాలున్నాయని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.
భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. ఆ తర్వాత నుంచీ రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతూ వచ్చాయి.
రెండు దేశాలూ పరస్పరం దౌత్యవేత్తలను కూడా ఆయా దేశాలను వీడాలని కోరాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంత దిగజారిన పరిస్థితిలో ఉన్నాయి.
ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేసినప్పుడు ట్రూడో కెనడాలో సిక్కు సమాజాల ఓట్లు రాబట్టుకోవడం కోసమే భారత్ పట్ల ఇలాంటి దూకుడు వైఖరిని ప్రదర్శించారని చెప్పుకున్నారు.
కెనడా ప్రభుత్వం అక్కడి ఖలిస్తానీ వేర్పాటువాదులపై చర్యలు తీసుకోవాలని భారత్ చాలా కాలంగా కోరుతూ వస్తోంది. ట్రూడో ప్రభుత్వం తమ ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఖలిస్తాన్ పట్ల మెతక వైఖరితో ఉందని అంటోంది. విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కూడా అలా అన్నారు.
కెనడా జనాభాలో 2.1 శాతం సిక్కుల జనాభా ఉంటుంది. గత 20 ఏళ్లలో కెనడాలో సిక్కుల జనాభా రెట్టింపు అయ్యింది. ఇందులో ఎక్కువమంది భారత్‌లోని పంజాబ్ నుంచే విద్య, కెరియర్, ఉద్యోగాలు లాంటి కారణాలతో కెనడా చేరుకున్నారు.