Kailash Mansarovar Yatra | త్వరలోనే ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర..

కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్‌-చైనా అంగీకరించాయి.


త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసులు సైతం మొదలవనున్నాయి. ఇటీవల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో రెండురోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్చల సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ బీజింగ్‌లో పర్యటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి.. పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి.

త్వరలోనే యాత్ర ప్రణాళిక..

ఇదిలా ఉండగా.. కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఏటా వేలాది మంది కైలాస, మానస సరోవర యాత్రలో పర్యాటకులు పాల్గొనేవారు. ఈ యాత్ర కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. తాజాగా యాత్ర పునరుద్ధరించడంతో పాటు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక త్వరలోనే ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించేందుకు అధికారులు త్వరలోనే సమావేశమవనున్నారు.

భారీగానే ఖర్చులు..

కైలాస మానస సరోవర్‌ యాత్రకు భారీగానే ఖర్చు కానున్నది. ప్రతి భారత పౌరుడు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చని తెలుస్తున్నది. ప్రయాణానికి సంబంధించిన అన్ని రకాల ఫీజులు దాదాపు రెట్టింపు కావడంతో ఖర్చులు తడిసి మోపడవనున్నాయి. అదే సమయంలో నిబంధనలు కఠినతరం చేసింది. చైనా ‘గ్రాస్‌ డ్యామేజింగ్‌ ఫీజు’ను వసూలు చేయనున్నది. ప్రయాణ సమయంలో కైలాష్‌ పర్వతం చుట్టూ ఉన్న గడ్డి దెబ్బతింటుందని.. దానికి ప్రయాణికులే భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పింది. కైలాష్ మానసరోవర్ యాత్ర నేపాల్ టూర్ ఆపరేటర్లకు పెద్ద వ్యాపారం కాగా.. కొత్త రూల్స్‌, పెరిగిన ఛార్జీల నేపథ్యంలో ఒక్కో పర్యాటకుడికి రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.

యాత్రకు వెళ్లేందుకు మూడు మార్గాలు..

మానస్‌ సరోవర్‌కు మూడు మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల గుండా ప్రయాణానికి దాదాపు 14 రోజుల నుంచి గరిష్ఠంగా 21 రోజుల సమయం పడుతుంది. సముద్ర మట్టానికి కైలాస మానసరోవరం 22వేల అడుగుల ఎత్తుల ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కింలోని నాథులా నుంచి 802 కిలోమీటర్లు, ఇక మూడు మార్గమైన నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే, యాత్రలో పాల్గొనే పర్యాటకులంతా వందశాతం ఫిట్‌గా ఉంటే మాత్రమే ప్రయాణం చేయాలి. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి.

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు..

ఈ యాత్ర జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. కనీస వయసు 18 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 70 సంవత్సరాల వరకు ఉండొచ్చు. యాత్రకు ముందు పర్యాటకులకు ఢిల్లీలో మూడురోజులు శిక్షణ ఇస్తారు. పాస్‌పోర్ట్, వీసా, అడ్రస్‌ ఫ్రూప్‌, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు, మెడికల్‌ సర్టిఫికెట్‌ సైతం తప్పనిసరి. కీలక పాత్రలు లేకపోతే ప్రయాణం సాధ్యం కాదు. కైలాస పర్వతం హిందులకు చాలా పవిత్రమైన ప్రదేశం. శివపార్వతులు కైలాస పర్వతంపై ఉంటాడని భక్తుల విశ్వాసం. జైన మతంలో రిషభ దేవ్ ఇక్కడే మోక్షం పొందినట్లుగా విశ్వసిస్తారు. బౌద్ధమతంలో కైలాస పర్వతం విశ్వాసానికి కేంద్ర బిందువుగా చెబుతుంటారు.