Kamala Harris: డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు

www.mannamweb.com


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (America presidential Election) డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హారిస్‌ (59) (Kamala Harris) ఖరారయ్యారు. దీంతో నవంబర్‌ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (78)తో ఆమె పోటీ పడబోతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చ్‌వల్‌ రోల్‌ కాల్‌లో ఆమె సాధించినట్లు డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీ ఛైర్‌ జేమ్‌ హరిసన్‌ తాజాగా ప్రకటించారు. దీంతో అమెరికా (USA) అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే ఇక. డిలిగేట్‌ల ఓటింగ్‌ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మెజారిటీ ఓట్లను పొందినట్లు జేమ్‌ హరిసన్‌ పేర్కొన్నారు.

చికాగోలో ఈనెల చివరాఖరున జరగనున్న కన్వెన్షన్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కోసం ర్యాలీ చేపట్టి తమ బలం ప్రదర్శిస్తామని హరిసన్‌ తెలిపారు. పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రాట్ల ప్రతినిధులు ఈ మెయిల్‌ ద్వారా ఓటింగ్‌ వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్‌ సోమవారం సాయంత్రం ముగియనుంది. మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్‌ ఇంతవరకు ఎంపిక చేసుకోలేదు. ఈ వారంతంలో ఆమె నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఇక అధికార నామినేషన్‌ ఆగస్టు 7తో ఖరారు కానుంది. నామినేషన్‌ కోసం ఇప్పటివరకు ఆమెకు పోటీలో దారిదాపుగా ఎవరూ లేరు.

డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ఖరారు కావడంతపై కమలా హారిస్‌ స్పందించారు. ‘‘డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దేశం పట్ల ప్రేమతో, ఉత్తమమైన దానికోసం పోరాడే వ్యక్తులను ఒక్కటి చేయడమే నా ప్రచారం ఉద్దేశం. మేము మా దేశాన్ని ప్రేమిస్తాము. ఆమెరికా వాగ్దానాన్ని విశ్వసిస్తాం. వర్చువల్‌ ఓటింగ్‌ సమయం ముగిశాక అధ్యక్ష నామినేషన్‌ను అధికారికంగా అంగీకరిస్తాను’’ అని కమలా పేర్కొన్నారు. ఈ నెలలో చికాగోలో మేము సమావేశం అవుతాము. అందరం ఒక్కపార్టీగా నిలబడతాము. ఈ చరిత్రాత్మక సంఘటనను వేడుక చేసుకుంటాము అని కమలా హారిస్‌ తెలిపారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీచేయనున్న ఇతర దేశాల మూలాలు ఉన్న మహిళగా ఆమె చరిత్రకెక్కనున్నారు. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్‌ను స్వీకరిస్తారు. అనంతరం అవే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ విరమించుకోవడంతో వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ తొలి నుంచి రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌, మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు.