కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లో రాయి తీస్తనంటే నమ్ముతారా? ఇప్పుడు కర్ణాటకలో కొనసాగుతున్న ప్రభుత్వం పనితీరు అలాగే ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీ ప్రకటనలు చూసి తమ బతుకులు మారుతాయని ఆశపడ్డ కన్నడీకులు హస్తం గుర్తుకు జై కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత హామీలు నెరవేర్చే క్రమంలో అప్పుల ఊబిలో కూరుకుపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఉచితాల అమలు కోసం రక రకాల పన్నులు విధించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో ఆర్థిక వనరులు ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అంతకు అంతే ఉన్నాయి. వస్తున్న ఆదాయంలో ఇరవై శాతం ఉచిత హామీలకే పోతుందని అంచనా కడుతున్నారు అధికారులు. దీంతో అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఇది పెరిగి పెరిగి తిరిగి ప్రజలపై పెను భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. తాజాగా కర్ణాటకలో బస్సు చార్జీలు పెంచే యోచనలో ఉందని.. అలా పెంచితే కానీ కర్ణాటక ఆర్టీసీ మనుగడ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారాంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ పేపర్ డ్యూటీ, సెల్స్ ట్యాక్స్, పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ డ్యూటీ, పాల ధర, రోడ్ ట్యాక్స్ ఇలా రక రకాల ట్యాక్స్ లు పెంచి ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నారు.
గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నీడీకులకు గృహజ్యోతి, శక్తి, గృహలక్ష్మి, యువనిధి, అన్నభాగ్య వంటి ఐదు గ్యారెంటీల అమలుకు హామీ ఇచ్చింది. ఇది నమ్మిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని చుట్టబెట్టారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి ఇచ్చిన హామీల విలువ ఏడాదికి సుమారు 60 వేల కోట్లకు పైగానే అంచనాలు ఉన్నాయని అంటున్నారు. జనాకర్షక వరాలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా ఇదే తంతు కొనసాగుతుంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రజలు లేరు.. హామీలు ఇస్తే అవి నేరవేర్చి తీరాలని అంటున్నారు. అందుకు ప్రతిపక్ష పార్టీలు వంతు పాడుతుంటాయి.
ఇటీవల కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన కర్ణాటకలో తీవ్ర కరువు, కరెంట్ ఇబ్బందులతో పంట నష్టం వల్ల అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఉచిత హామీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు అదే ప్రజలను ట్యాక్సుల రూపంలో పట్టి పీడించడం ప్రభుత్వాల పనైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.