కేశినేని నానిది రాజకీయ ఆత్మహత్యే !

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే అని ఓ నానుడి ఉంది. ఎందుకంటే రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలే వారిని పాతాళానికి పడేస్తాయి. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన తెలుగు వారిని చూసిన తర్వాత అందరి మదిలో ఒక పేరు వచ్చింది.


అదే కేశినేని నాని. టీడీపీలో పద్దతిగా ఉండి ఉంటే పెమ్మసానికి బదులుగా ఆయనే ప్రమాణం చేసేవారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

కేశినేని నాని రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మూడో సారి ఆయనకు టిక్కెట్ రాకుండా చేసుకున్నారు. రెండో సారి పార్టీ ఓడిపోయిన తర్వాత.. పార్టీ కోసం పని చేయాల్సిన ఆయన .. మరింత ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు. బెజవాడ ఎంపీగా గెలిచాను కాబట్టి తానే కింగునని.. కృష్ణా జిల్లా పార్టీ మొత్తాన్ని తన చేతిలో పెట్టాలన్నట్లుగా వ్యవహరించారు. చివరికి పార్టీకి పని చేయడం మానేసి గ్రూపుల్ని ప్రోత్సహించారు. అధినేతకు గౌరవం ఇవ్వలేదు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తే కనీసం పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమయ్యారు.

టీడీపీ కంటే తానే బలవంతుడ్ని అని కేశినేని నాని బలమైన అభిప్రాయం. ఆయన మాటల్లోనే అది వ్యక్తమవుతూ ఉంటుంది. చివరికి పార్టీ ఆయన హై ను భ రించలేక పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ ను చూసుకుని మరింత రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చి పోటీ చేసినా తాను బెజవాడలో మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. కానీ తన సోదరుడి చేతిలో మూడు లక్షల ఓట్లతేడాతో ఓడిపోయారు.

వైసీపీలో ఆయన పరిస్థితి ఏమిటో జగన్ రెడ్డి ఇంట్లో… జరిగిన సమావేశంలో ఓ మూల నిలబడి దిక్కులు చూస్తున్న ఫోటోలోనే తేలిపోయింది. టీడీపీలో ఆయన గౌరవం వేరు. వైసీపీలో దక్కే గౌరవం వేరు. అతి ఆశలతో దారి తప్పి.. రాజకీయ భవిష్యత్ నే కాదు.. తన కుమార్తె రాజకీయ భవిష్యత్ ను కూడా నాశనం చేశారు కేశినేని నాని. రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదో నానిని చూస్తే అర్థమైపోతుదంని ఏపీ వ్యాప్తంగా సెటైర్లు పడుతున్నాయి.