బోరుగడ్డ అనిల్ అరెస్ట్ వ్యవహారం.. హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్‌ మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనిల్ అరెస్ట్ విషయంలో కులం ప్రస్తావన తీసుకువస్తుండటాన్ని వంగలపూడి అనిత తప్పుబట్టారు. “డాక్టర్ సుధాకర్‍ను రోడ్డు మీద కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేస్తే.. అతని అవమానం తట్టుకోలేక చనిపోయారు. వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు. ఇవన్నీ జరిగినప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని ఎందుకు రోడ్డు మీదకు రాలేదు.ఇప్పుడు దళిత కార్డు బయటికి తీసుకు వస్తున్న వారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? దళితురాలైన నన్ను సీఎం చంద్రబాబు గారు.. హోం మంత్రిని చేశారు. చట్టానికి-కులానికి సంబందం లేదు. ఏ కులమైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో నాపై 23 కేసులు పెట్టారు. అసలు క్రిమినల్స్‌కు కులం ఏంటి?” అని వంగలపూడి అనిత మండిపడ్డారు.

మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనిల్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. 2021లో ఓ వ్యక్తిని రూ.50 లక్షల కోసం బెదిరించినట్లు బోరుగడ్డ అనిల్ మీద ఆరోపణలు ఉన్నాయి. దీనిపే అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ కేసులోనే బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ కుమార్ అనేక అరాచకాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేశారని చెప్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్, రఘురామ, కోటంరెడ్డి వంటి వారిని బెదిరించాలని టీడీపీ నేతలు చెప్తున్నారు. అప్పటి ప్రతిపక్షనేతలతో పాటుగా వారి కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని.. ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లో తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ ఆరోపణ. మరోవైపు బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్రవ్యాప్తంగా 15 వరకు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిసింది. రౌడీషీట్ కూడా ఉన్నట్లు సమాచారం.