జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశం

www.mannamweb.com


ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సీబీఐకి కోర్టుకు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గుర్తుచేసింది.

ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నవంబర్‌ నెలకు సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై రెండుసార్లు ధర్మాసనం విచారణ జరిపింది. ఉదయం, మధ్యాహ్నం భోజనం విరామ అనంతరం విచారణ జరిపింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు. కేసులు ట్రయల్‌ ప్రారంభం కాకుండా… ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు.

ఆరుగురు జడ్జిలు మారిపోయారు, రిటైర్‌ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్‌ చేస్తున్నామని, ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు.