ఏపీలో మెగా డీఎస్సీపై కీలక పరిణామం

ఏపీలో మెగా డీఎస్సీ( Mega DSC ) నియామక ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


జిల్లాస్థాయిలో 14,088 పోస్టులు ఉండగా.. రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2259 పోస్టులు ఉన్నాయి. ఈరోజుతో గడువు ముగియనుంది. జూన్ 6 నుంచి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో డీఎస్సీ పరీక్ష గడువును 45 రోజులపాటు పొడిగించాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మెగా డీఎస్సీ వాయిదా వేయాల్సిందేనని కోరుతున్నాయి.

* ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్..
గత నెల 20న ఏపీ ప్రభుత్వం( AP government) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెద్ద మొత్తంలో ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగులు ఆశలన్నీ వీటిపైనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ గడువు, వయోపరిమితి, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల పోరాట ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని.. పరీక్షకు కనీసం 40 రోజుల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. డీఎస్సీలో నార్మలైజేషన్ రద్దు చేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

* నెల రోజులపాటు ఆన్లైన్ పరీక్షలు..
డీఎస్సీ ఆన్లైన్ రాత పరీక్ష ( DSC online exam) జూన్ 6 నుంచి జూలై 6 వరకు.. నెల రోజులపాటు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే సరిగ్గా అదే సమయంలో కేంద్ర రైల్వే శాఖకు చెందిన ఆర్ఆర్బి ఎన్పిటిసి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి గ్రాడ్యుయేట్ పోస్టుల పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నరు. ఎన్నో నెలలుగా శిక్షణ పొందుతున్నారు. డీఎస్సీకి హాజరు కావాలా? లేకుంటే ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్ రాయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఒక పరీక్ష రాస్తే మరో పరీక్షను కోల్పోవాల్సి ఉంటుంది. దీనికి తోడు పలు బ్యాంకు పరీక్షలు సైతం జూన్లోనే జరగనున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిఎస్సి పరీక్ష తేదీలను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.