ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి అన్ని విషయాల్లోనూ మొండి చేయి చూపుతున్న సీఎం చంద్రబాబు.. ఓ విషయంలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు సై అన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత వైఎస్ జగన్ కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు సైతం అంగీకరించని చంద్రబాబు.. ఇప్పుడు ఆయన రైట్ హ్యాండ్ అయిన ఓ సీనియర్ నేతకు కీలక పదవి ఇచ్చేందుకు అంగీకరించారు.
ఏపీలో సీఎం, కేబినెట్ మంత్రుల తర్వాత కీలకమైన పోస్టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్. ప్రభుత్వం పెట్టే ప్రతీ ఖర్చునూ సమీక్షించే అధికారం ఉన్న ప్రజా పద్దుల కమిటీకి ఛైర్మన్ గా విపక్షం నామినేట్ చేసే ఎమ్మెల్యేను ఎంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా వైసీపీ నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ గా అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయం కోరింది.. దీంతో జగన్ పార్టీలో ఆయన తర్వాత నంబర్ టూ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ పోస్టుకు నామినేట్ చేశారు.
ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీఏసీ ఛైర్మన్ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులుంటారు. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు అవకాశముంది. అయితే వీరి ఎన్నిక కోసం ప్రస్తుత లెక్కల ప్రకారం అసెంబ్లీ, మండలిలోనూ కనీసం 20 మంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక్క పీఏసీ సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేదు. మండలిలో మాత్రం ఒకటి లేదా ఇద్దరు సభ్యుల్ని గెలిపించుకునే పరిస్దితి ఉంది.
అయితే ప్రభుత్వం ఇదంతా లేకుండా నేరుగా పీఏసీ సభ్యుల్ని, ఛైర్మన్ ను కూడా సంప్రదాయం ప్రకారం నియమించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తవానికి పీఏసీ సభ్యుల ఎన్నిక కోసం నామినేషషన్లకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సమయం ఉంది. ఆ తర్వాత ఎన్నిక అవసరమా కాదా అనేది నిర్ణయిస్తారు. అయితే వైసీపీ పీఏసీ ఛైర్మన్ గా నామినేట్ చేసిన పెద్ది రెడ్డి తరపున వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. దీంతో మరో గంటలో ఏం జరగబోతోందో తేలిపోనుంది.