ఫైనల్లో హైదరాబాద్ బోల్తా
113 పరుగులకే ఆలౌట్
నైట్‌రైడర్స్ ఘనవిజయం
విజృంభించిన స్టార్క్, హర్షిత్, రసెల్
ఒక మ్యాచ్‌లో 277.. ఇంకో మ్యాచ్‌లో 287.. మరో మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 125. ఈ ఐపీఎల్ (IPL) లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) ది మామూలు విధ్వంసమా?
15, 16 బంతుల్లో అర్ధశతకాలు.. 39 బంతుల్లోనే శతకం.. హైదరాబాద్ బ్యాటర్లవి మామూలు విన్యాసాలా?
ఈ విధ్వంసక విన్యాసాలకు సార్థకత చేకూర్చాల్సిన అసలు మ్యాచ్‌లో అదే జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలిపోయింది.
ఇన్నాళ్లూ ప్రత్యర్థులపై ఉప్పెనలా పడిపోయిన ఓపెనర్లు 2, 0 పరుగులకే పెవిలియన్ చేరిపోయారు. మిగతా బ్యాటర్లూ చేతులెత్తేశారు.
చెన్నైలో అంత తేలిక కాదని తెలుసు. ఇక్కడ 200-250 స్కోర్లు ఎవరూ ఆశించలేదు. క్వాలిఫయర్ మ్యాచ్‌లో మాదిరే 170-180 మధ్య స్కోరు చేస్తే మిగతా పని బౌలర్లు చూసుకుంటారన్న ధీమా!
కానీ సైకిల్ స్టాండ్‌ను తలపించిన బ్యాటింగ్ ఆర్డర్.. పదునెక్కిన కోల్‌కతా (Kolkata Knight Riders) బౌలింగ్‌కు దాసోహమంది. ఫలితం.. చెపాక్‌లో హైదరాబాద్‌కు ఘోర పరాభవం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసిన నైట్‌రైడర్స్ మూడో ట్రోఫీని ముద్దాడింది.
చెన్నై
ఈ ఐపీఎల్ (IPL) లో సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చి కప్పు తమదే అన్న అంచనాలు కలిగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అసలు పోరులో తేలిపోయింది. ఆదివారం చెపాక్‌లో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట మిచెల్ స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24), ఆండ్రి రసెల్ (3/19)ల అద్భుత బౌలింగ్‌కు తలవంచిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. 24 పరుగులు చేసిన కెప్టెన్ కమిన్సే (Pat Cummins) టాప్‌స్కోరర్. అనంతరం వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్; 26 బంతుల్లో 4×4, 3×6), రహ్మనుల్లా గుర్బాజ్ (39; 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మిచెల్ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. 2012, 2014లోనూ విజేతగా నిలిచిన కోల్‌కతా.. పదేళ్ల తర్వాత మళ్లీ కప్పు అందుకుంది.
పూర్తి భిన్నంగా..: చెపాక్ పిచ్‌పై సన్‌రైజర్స్ తడబాటు చూస్తే లక్ష్యం చిన్నదైనా కోల్‌కతా చెమటోడుస్తుందేమో అనిపించింది. కానీ కోల్‌కతా బ్యాటర్లు ఎదురుదాడితో సగం ఓవర్లలో లక్ష్యాన్ని కరిగించేశారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ మాత్రమే మెరుపుల్లేకుండా సాగింది. ఆ ఓవర్లో భువనేశ్వర్ అయిదు పరుగులే ఇచ్చాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ఒక సిక్సర్ బాదిన వెంటనే నరైన్ (6) ఔటైపోయాడు. అప్పుడు సన్‌రైజర్స్‌లో కాస్త చిగురించిన ఆశలు.. కూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేశ్ అయ్యర్ వచ్చీ రాగానే హైదరాబాద్ బౌలర్లపై ఉప్పెనలా పడిపోయాడు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో అతనువరుసగా 4, 6, 6 బాది ఇన్నింగ్స్‌కు రాకెట్ వేగాన్నందించాడు. నటరాజన్ వేసిన ఆరో ఓవర్లోనూ అతను వరుసగా 4, 4, 6, 4 బాదడంతో హైదరాబాద్‌కు పరాభవం తప్పదని తేలిపోయింది. మరో ఎండ్‌లో గుర్బాజ్ కూడా ధాటిగా ఆడాడు. విజయానికి 12 పరుగులే అవసరమైన స్థితిలో గుర్బాజ్ ఔటైనా.. శ్రేయస్ (6 నాటౌట్)తో కలిసి వెంకటేశ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఆపసోపాలు..: రాజస్థాన్‌తో రెండో క్వాలిఫయర్‌తో పోలిస్తే చెపాక్ పిచ్ బ్యాటింగ్‌కు ఎక్కువ అనుకూలం అన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లీగ్ దశలో మాదిరే ఓపెనర్లు హెడ్, అభిషేక్ చెలరేగిపోతారనుకుంటే.. అనూహ్యంగా రెండు ఓవర్లు తిరిగేసరికే పెవిలియన్ చేరిపోయారు. తొలి బంతి నుంచే భారీ షాట్లతో చెలరేగిపోయే అభిషేక్ (2).. వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడడంతోనే పిచ్ అంత తేలికగా లేదని అర్థమైపోయింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన అతను.. స్టార్క్ కళ్లు చెదిరే రీతిలో సంధించి ఔట్ స్వింగింగ్ డెలివరీకి ఆఫ్ స్టంప్ లేచిపోవడంతో నిశ్చేష్ఠుడై వెనుదిరిగాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే.. తర్వాతి ఓవర్లో (అరోరా) హెడ్ (0) కూడా ఔటైపోయాడు. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్ అంతా కూడా బ్యాటర్ల ఆపసోపాలతోనే సాగింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన త్రిపాఠి (9).. స్టార్క్ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు. మార్‌క్రమ్ (20), నితీశ్ (13) నిలిచినా.. అదీ కాసేపే. చివరి ఆశ క్లాసెన్ మీద నిలవగా.. ఓ ఎండ్‌లో అతను పట్టుదలతో నిలిచినా అవతలి ఎండ్‌లో సహకరించే వారు కరవయ్యారు. ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్ బాదిన షాబాజ్ అహ్మద్.. ఆ వెంటనే వరుణ్ (1/9)కు వికెట్ ఇచ్చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ సమద్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. చివరికి 15వ ఓవర్లో క్లాసెన్ (16) కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఆశలు ఆవిరయ్యాయి. కెప్టెన్ కమిన్స్ చివర్లో పోరాడడంతో హైదరాబాద్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆరంభంలో స్టార్క్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తే.. తర్వాత హర్షిత్ రాణా, రసెల్ ఆ జట్టు పని పట్టారు. లీగ్ దశలో సిక్సర్ల మోత మోగించిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే కొట్టారు.
హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; మార్‌క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 13; క్లాసెన్ (బి) హర్షిత్ 16; షాబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; ఉనద్కత్ ఎల్బీ (బి) నరైన్ 4; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్) 113; వికెట్ల పతనం: 1-2, 2-6, 3-21, 4-47, 5-62, 6-71, 7-77, 8-90, 9-113; బౌలింగ్: స్టార్క్ 3-0-14-2; వైభవ్ 3-0-24-1; హర్షిత్ 4-1-24-2; నరైన్ 4-0-16-1; రసెల్ 2.3-0-19-3; చక్రవర్తి 2-0-9-1
కోల్‌కతా ఇన్నింగ్స్: గుర్బాజ్ ఎల్బీ (బి) షాబాజ్ 39; నరైన్ (సి) షాబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ నాటౌట్ 52; శ్రేయస్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114; వికెట్ల పతనం: 1-11, 2-102; బౌలింగ్: భువనేశ్వర్ 2-0-25-0; కమిన్స్ 2-0-18-1; నటరాజన్ 2-0-29-0; షాబాజ్ 2.3-0-22-1; ఉనద్కత్ 1-0-9-0; మార్‌క్రమ్ 1-0-5-0
2
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఓడిన పైనల్స్. 2018లోనూ ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
3
ఐపీఎల్‌లో కనీసం మూడు టైటిళ్లు గెలిచిన జట్లలో కోల్‌కతా స్థానం. సీఎస్కే, ముంబయి ఇండియన్స్ అయిదేసి టైటిళ్లు సాధించాయి.
4
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వెంకటేశ్ అయ్యర్ వరుసగా చేసిన అర్ధశతకాలు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ అతనే.
8
ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్లలో శ్రేయస్ స్థానం. షేన్‌వార్న్, గిల్‌క్రిస్ట్, ధోని, గంభీర్, రోహిత్, వార్నర్, హార్దిక్ పాండ్య అతని కంటే ముందున్నారు.
57
కేకేఆర్ విజయంలో మిగిలిన బంతులు. బంతులపరంగా చెపాక్‌లో ఇదే అతిపెద్ద విజయం
ఆరెంజ్ క్యాప్: కోహ్లి (741 పరుగులు, బెంగళూరు)
పర్పుల్ క్యాప్: హర్షల్ (24 వికెట్లు, పంజాబ్)
అత్యంత విలువైన ఆటగాడు: సునీల్ నరైన్ (488 పరుగులు, 17 వికెట్లు, కోల్‌కతా)
ఉత్తమ వర్దమాన ఆటగాడు: నితీశ్‌కుమార్ రెడ్డి (303 పరుగులు, హైదరాబాద్)
ఉత్తమ వేదిక, పిచ్: హైదరాబాద్,
ప్రైజ్‌మనీ: రన్నరప్ హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్లు, విజేత కోల్‌కతాకు రూ.20 కోట్లు