ఎలక్ట్రిక్ బైక్ కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకుంటే బాధపడుతారు

టీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు. ఎందుకంటే అవి పెట్రోల్ ఖర్చును తగ్గిస్తాయి.


పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే తర్వాత మీరు ఇబ్బందులు పడవచ్చు. అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉండే కొన్ని సమస్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. రేంజ్, ఛార్జింగ్ సమస్యలు

పెట్రోల్ స్కూటర్‌ను మీరు ఎక్కడైనా పెట్రోల్ పంపులో నిమిషాల్లో ఫుల్ చేయించుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇది సాధ్యం కాదు. వాటి రేంజ్ పరిమితంగా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే అది వెళ్లగలిగిన దూరం వరకే ప్రయాణించగలరు. మీరు వాటిని నగరంలో ఉపయోగించవచ్చు. కానీ దూర ప్రయాణాలకు వినియోగించలేరు. మీ నగరంలో ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉంటే.. లాంగ్ డ్రైవ్ చేయడం చాలా కష్టం. అంతే కాకుండా స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి చాలా గంటల సమయం పడుతుంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది.

2. బ్యాటరీ లైఫ్.. ఖర్చు

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత ఖరీదైన భాగం దాని బ్యాటరీ. సాధారణంగా కంపెనీలు బ్యాటరీపై 8 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తాయి. అయితే ఆ తర్వాత మీరు కొత్త బ్యాటరీ కొనుక్కోవాల్సిందే. దీని ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బ్యాటరీ ధర స్కూటర్ ధరలో 40-50 శాతం వరకు ఉంటుంది. కాబట్టి కొత్త బ్యాటరీకి మీరు గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

3. విద్యుత్ బిల్లు.. నిర్వహణ ఖర్చు

మీరు పెట్రోల్ పోయకపోయినా, స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి విద్యుత్ ఖర్చవుతుంది. ఇది విద్యుత్ బిల్లును పెంచుతుంది. అయితే ఇది పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. ఖర్చు అయితే ఉంటుంది. దీనికి తోడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు తక్కువ మెయింటెనెన్స్ అవసరం. కానీ ఏదైనా పెద్ద ఎలక్ట్రానిక్ భాగం దెబ్బతింటే, దానిని రిపేర్ చేయడానికి చాలా ఖర్చవుతుంది.

4.టాప్ స్పీడ్.. పనితీరు

చాలా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల టాప్ స్పీడ్, పనితీరు పెట్రోల్ స్కూటర్ల అంత ఉండవు. వాటి వేగం పరిమితంగా ఉంటుంది. ఇది హైవేపై ప్రయాణించడానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. వాలుగా ఉన్న రోడ్లపై లేదా ఎక్కువ బరువుతో ప్రయాణించినప్పుడు వాటి వేగం మరింత తగ్గుతుంది. అంతే కాకుండా ఎక్కువ బరువుతో ప్రయాణిస్తే స్కూటర్ రేంజ్ కూడా తగ్గుతుంది.

5. ధర

ఎలక్ట్రిక్ స్కూటర్లు, ముఖ్యంగా మంచి రేంజ్, ఫీచర్లు ఉన్నవి, పెట్రోల్ స్కూటర్ల కంటే ఖరీదైనవి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీకు తక్కువ రేంజ్, ఫీచర్లు ఉన్న మోడల్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అందుకే ధర పరంగా కూడా వీటిని అంతగా మంచివిగా చెప్పలేం.

ఎవరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి?

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, మీ రోజువారీ ప్రయాణం తక్కువగా ఉంటే, మీ ఇంట్లో స్కూటర్ ఛార్జ్ చేయడానికి తగిన స్థలం ఉంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఒక మంచి ఎంపిక కావచ్చు. కానీ మీకు లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లాలని, ఎక్కువ బరువు మోయగల స్కూటర్ కావాలని లేదా వేగంగా వెళ్లాలని అనుకుంటే, పెట్రోల్ స్కూటర్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.