కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితుడు సంజయ్‌రాయ్ ఒక్కడే లేడీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపేశాడని ఛార్ఝ్‌షీట్‌లో పేర్కొన్నారు.
200 మంది సాక్ష్యులను విచారించినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బాధితురాలిపై గ్యాంగ్‌రేప్ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. సెమినార్ హాల్లో లేడీ డాక్టర్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడినట్టు , అత్యాచారం చేసి చంపేసినట్టు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఆగస్ట్ 9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో లేడీ డాక్టర్‌పై హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా ? అన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు సీబీఐ వెల్లడించింది. సంఘటనా స్థలంలో సంజయ్‌రాయ్‌కు సంబంధించి బ్లూటూత్ దొరికింది. దీని ఆధారంగా అతడే నేరం చేసినట్టు గుర్తించారు. అభయ హత్యాచార కేసులో ఆగస్ట్ 13వ తేదీన సీబీఐకి అప్పగించారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో డాక్టర్ హత్యాచార ఘటన తరువాత ఆధారులు చెరిపేసేందుకు కూడా కుట్ర జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఆర్‌జికర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌రాయ్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఆస్పత్రిలో నిధుల గోల్‌మాల్ విషయంలో ఆయనపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.