కొర్రలు పోషకాల గని అని చెప్పవచ్చు. సాధారణంగా అందరూ చపాతీ, రొట్టెల కోసం గోదుమపిండిని వాడుతుంటారు. దీనికంటే కూడా కొర్రపిండి చాలా మంచిదంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. ఒక కప్పు కొర్రపిండిలో 10 గ్రాముల ప్రొటీన్, 7.4 గ్రాముల డయటరీ ఫైబర్ , 83 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్ ఉంటాయి. అంతేకాదు, ఇంకా చాలా రకాల మైక్రోన్యూట్రియెంట్లు కొర్రలలో ఉంటాయి. కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయి. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి.
ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలాసేపు అలసిపోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసిపోకుండా పనిచేయగల సమయం పెరుగుతాయి. అంతేకాదు, రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.
కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు శరీరంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. టైప్–2 డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ జింక్ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది.