ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం మహా కుంభమేళా 2025కి రంగం సిద్ధమవుతోంది. భారతదేశంలోని పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక పండుగ జరగనుంది.
ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే, ఈ మహా కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వారితో పాటుగా, సమాజంపై తమదైన ముద్ర వేసే మహిళా సన్యాసినులు కూడా ఈ మేళాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి గురించి కొన్ని ఆసక్తికర నిజాలు తెలుసుకుందాం.
నాగ సాధువులు
నాగ సాధువుల గురించి వింటేనే ఒక విధమైన భక్తిభావం, ఆశ్చర్యం కలుగుతాయి. వీరు హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయానికి చెందినవారు. వీరి చరిత్ర ఎంతో పురాతనమైనది. మొహెంజో-దారో నాణేలపై కూడా వీరి ఆనవాళ్లు కనిపించాయి. సంస్కృతంలో “నాగ” అంటే పర్వతం లేదా పర్వతాల సమీపంలో నివసించే వ్యక్తి అని అర్థం. ప్రాచీన కాలంలో నాగ సాధువులు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా ఉండేవారు.
వీరు కత్తులు, త్రిశూలాలు, గదలు, విల్లంబులు వంటి ఆయుధాలను ధరించి దేవాలయాలను కాపాడేవారు. మొఘల్ సైన్యాల నుంచి శివాలయాలను రక్షించడంలో ఈ సాధువులు కీలక పాత్ర పోషించారు. చరిత్ర ఆధారాల ప్రకారం, వారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాన్ని వందకు సార్లకు పైగా ఓడించారు. నేటికీ, వారు ఆధ్యాత్మిక అన్వేషకులే కానీ, వారిలో దాగివున్న యోధుడి లక్షణాలు మాత్రం చెక్కుచెదరలేదు.
నాగ సాధువుల జీవన విధానం
యుక్త వయస్సులోనే యువకులు నాగ సాధువుల సంప్రదాయంలో సన్యాసం స్వీకరిస్తారు. వారు తమ కుటుంబంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుని, తమ జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, మతపరమైన ఆచారాలకు అంకితం చేస్తారు. నాగ సాధువుగా మారడం అనేది అంత సులభం కాదు. దీనికి ఎంతో సమయం, క్రమశిక్షణ అవసరం.
ఒక సంవత్సరం పాటు కఠిన సాధన చేసిన తర్వాత వారికి “నాగ” అనే బిరుదు లభిస్తుంది. ఆరేళ్లపాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తే వారిని “గొప్ప పురుషుడు” అని పిలుస్తారు. 12 ఏళ్ల నిరంతర సాధన తర్వాత వారు అసలైన నాగ సాధువులుగా గుర్తింపును అందుకుంటారు. వీరికి శాశ్వత నివాసం అంటూ ఏమీ ఉండదు. గుహల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో జీవిస్తుంటారు. బూడిదను శరీరంపై పూసుకోవడం వారి వైరాగ్యానికి, పవిత్రతకు, శివునికి ఉన్న భక్తికి చిహ్నం. శివుడు కూడా భస్మాన్ని ధరించిన రూపంలో దర్శనమిస్తాడు. కుంభమేళా సమయంలో వారు తాత్కాలిక మఠాలలో (Akharas) నివసిస్తారు. అక్కడ ధ్యానం చేస్తూ, ఆధ్యాత్మిక సాధనలో భాగంగా అప్పుడప్పుడు గంజాయి సేవిస్తారు.
మహిళా నాగ సాధువులు
పురుష నాగ సాధువుల మాదిరిగానే, మహిళా నాగ సాధువులు కూడా భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా వదిలేస్తారు. కుటుంబం, భౌతిక సంపదలతో ఉన్న బంధాలన్నింటినీ తెంచుకుంటారు. వీరి నాగ సాధువులుగా మారే ప్రక్రియ కూడా పురుషుల వలె కఠినంగా ఉంటుంది. వారు కూడా 6-12 ఏళ్ల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. మహిళా నాగ సాధువులు సాధారణంగా గుహలు, అడవులు లేదా పర్వతాలలో ధ్యానం చేస్తారు.
వీరు కుట్టని కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు, దానిని “గంటి (Ganti)” అని పిలుస్తారు. మహిళా నాగ సాధువులు తమ గత జీవితానికి ముగింపు పలుకుతూ తమకు తామే “పిండ ప్రదానం (Pind Daan)” చేసుకుంటారు. వీరికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది, వీరిని “మాతా” అని పిలుస్తారు. ఈ మహిళలు పురాతన హిందూ సంప్రదాయాలకు వారసులు, పవిత్రమైన జ్ఞానాన్ని మాటల ద్వారా తరతరాలకు అందిస్తారు.
కుంభమేళాలో సాధువుల ప్రాముఖ్యత
కుంభమేళాలో నాగ సాధువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, షాహీ స్నాన్ (రాజ స్నానం) అనే అత్యంత ముఖ్యమైన ఆచారం వీరితోనే ప్రారంభమవుతుంది. అలంకరించిన రథాలపై నాగ సాధువులు ఊరేగింపుగా నది ఒడ్డుకు చేరుకుంటారు. ఈ ఊరేగింపు కన్నుల పండుగలా ఉంటుంది.
వారు మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ, మంత్రాలను పఠిస్తూ ముందుకు సాగుతారు. వారు పవిత్ర నదిలో చేసే ఈ స్నానం, అక్కడ స్నానం చేసే ప్రతి ఒక్కరి పాపాలను కడుగుతుందని నమ్ముతారు. మహా కుంభ మేళా 2025లో నాగ సాధువులు మరోసారి ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. లక్షలాది మంది సందర్శకులకు తమ భక్తిని, వైరాగ్యాన్ని చాటి చెప్పనున్నారు. వారి ఉనికి ఈ మహా కుంభ మేళాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తుంది.