Kumbha Mela Stampede: ‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు

చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్‌రాజ్‌ సెక్టార్‌-2లో ప్రస్తుతం దృశ్యాలివే.


మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా ‍త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.

ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్‌ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.