ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో విజయం తరువాత కూటమి అసెంబ్లీలో.. బయటా మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది.
పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరారు. వైసీపీకి బలం ఉన్న శాసన మండలిలోనూ పలువురు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారు. ఇక, ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల పైన కన్నేసింది. అందులో భాగంగా స్థానిక సంస్థల్లో అవిశ్వాస కాల పరిమితి కుదిస్తూ తాజా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది.
చట్ట సవరణ
తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక చట్ట సవరణకు ఆమోదం లభించింది. రాష్ట్రం లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ సవరణ చేశారు. దీని వెనుక కూటమి ప్రభుత్వం పక్క ప్లాన్ తో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీ సభ్యుల సంఖ్య 11 మాత్రమే. అదే విధంగా మండలిలో వైసీపీ సంఖ్య బలం ఎక్కువగా ఉన్నా.. కొందరు వైసీపీ సభ్యులను కూటమి నేతలు తమ పార్టీల్లోకి వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
టార్గెట్ వైసీపీ
ఇప్పటికే రాజీనామా వైసీపీ సభ్యులు వాటి ఆమోదం కోసం పట్టుబడుతున్నారు. త్వరలో మండలి లో మరిన్ని ఖాళీలు భర్తీ సమయంలోనూ కూటమి పార్టీకే అవకాశం దక్కనుంది. ఇక.. స్థానిక సంస్థ ల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు కొనసాగుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ లను వైసీపీ కైవసం చేసుకుంది. అదే విధంగా తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు సైతం వైసీపీ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలు జిల్లా పరిషత్ లలో వైసీపీ సభ్యులు పార్టీ మారుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు.
జగన్ వాట్ నెక్స్ట్
క్రమేణా కూటమి పార్టీలకు అవసరమైన మెజార్టీ స్థానిక సంస్థల్లో వస్తున్నా.. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు మాత్రం కూటమి పార్టీలకు దక్కటం లేదు. గతంలో స్థానిక సంస్థల్లో అవిశ్వాసం కాల పరిమితి నాలుగేళ్లుగా ఉండేది. ఇప్పుడు కూటమి ఈ పరిమితి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇప్పటికే రెండేళ్ల కాల పరిమితి ముగియటంతో వరుసగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల ద్వారా తమ పార్టీలకు స్థానిక సంస్థలు దక్కేలా కూటమి పార్టీల నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రస్తుతం చేసిన చట్ట సవరణ సైతం అందులో భాగమనే వాదన ఉంది. దీంతో, ఇప్పుడు వైసీపీ ఈ విషయంలో ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.