జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రెస్ క్లబ్ వద్ద లక్ష్మిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ ఆన్‌లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉంది.
కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు కప్పి ఆమె తిరుగుతోంది. గత రెండు రోజులుగా ఆమె మీడియాలో కనపడుతుండడంతో జైపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
కాగా, లక్ష్మి చేసిన ఆరోపణల వల్ల కిరణ్ రాయల్ ఇప్పటికే జనసేనలో అంతర్గత విచారణ ఎదుర్కొంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన సూచనల మేరకు కాన్‌ఫ్లిక్ట్ కమిటీ విచారణ జరుపుతోంది.
ఈ విచారణ పూర్తయ్యే దాకా కిరణ్ రాయల్ జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆయనకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
కిరణ్ రాయల్ తన జీవితాన్ని నాశనం చేశారని లక్ష్మి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన వద్ద భారీగా డబ్బు తీసుకుని మోసం చేశారని, తనను అప్పుల పాలు చేశారని ఆమె ఆరోపించారు. అంతేగాక, తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నారని చెప్పారు. ఆమె విడుదల చేసిన ఆడియో, వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఓ మహిళతో తాను సన్నిహితంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలపై కిరణ్ రాయల్ అప్రమత్తమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను చోరీ చేసి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
వైసీపీ నేతలపై కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఇటువంటి బెదిరింపులతో తన గొంతు నొక్కాలని చూస్తున్నారని తెలిపారు. తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని కిరణ్ రాయల్ చెప్పారు.