చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. నేడు తెలుగు భాషా దినోత్సవం

www.mannamweb.com


దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినా.. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966వ సంవత్సరంలోలో తెలుగు భాషను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008వ సంవత్సరంలో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగానూ గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు కావడం విశేషం.

నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి. మనం ప్రతి యేటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం (Telugu Language Day) జరుపుకొంటాము. తెలుగు భాషకు గిడుగు చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. వాడుక భాషోద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం మన అందరికీ తెలిసిందే. తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చేవారిలో విరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు ఎప్పుడూ ఉంటారు. వారికి సమాన స్థాయిలో కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి (Gidugu Venkata Ramamurthy) జయంతిని మాతృ భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది.

1863 ఆగస్టు 29వ తేదీన అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకి, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు గిడుగు రామ్మూర్తి. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగానూ ఆయన మంచి ఎంతో కీర్తి సాధించారు. ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలను చేపట్టడమే గాక.. అవి మంచి ఫలితాలనూ సాధించడం మరో విశేషం.

పదవీ విరమణ తర్వాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను గిడుగు రామ్మూర్తి చేపట్టారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏర్పాటు చేస్తూ తెలుగు వాళ్లు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించారు. ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ గిడుగు రాజమండ్రి వచ్చేశారు. అప్పటినుంచి ఆయన స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ల పాటు రాజమండ్రిలోనే గడిపారు. ఈరోజు గిడుగు రామ్మూర్తి జన్మదినం సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుందాం.. నివాళులు అర్పిద్దాం.