Memory Power: జ్ఞాపకశక్తి పెంచుకుందాం

జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునేందుకూ, మెదడును ధారణ శక్తి వైపునకు మలిచేందుకూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న పుస్తకం- ‘మెమరీ: హౌ టూ డెవలప్, ట్రెయిన్‌ అండ్‌ యూజ్‌ ఇట్‌’. రచయిత విలియం వాకర్‌ ఆట్కిన్సన్‌. 20వ శతాబ్దం మొదట్లో రాసినదైనప్పటికీ నేటికీ దీనిలోని సూత్రాలు ఆచరణీయమే.


క్రమపద్ధతిలో సాధన చేస్తే.. నేర్చుకునే అంశాలను అర్థం చేసుకుని, ధారణను పెంచుకోగలమని రచయిత పుస్తకంలో రుజువులతో నిరూపిస్తారు. జిమ్‌కు వెళ్ళి, వ్యాయామం చేస్తే కండరాలు బలపడినట్టే మెదడుకు కూడా కావాల్సిన కసరత్తును అందిస్తే, జ్ఞాపకశక్తి దృఢంగా తయారవుతుంది. ‘నాకు ఏదీ జ్ఞాపకం ఉండటం లేదు’ అని డీలా పడిపోయేవారు దీనిలోని మానసిక వ్యాయామాలను సాధన చేస్తే మెరుగైన జ్ఞాపకశక్తిని పొందవచ్చు.

ప్రభావవంతమైన జ్ఞాపకశక్తికి మొదటి మెట్టు- శ్రద్ధ. విద్యార్థులు తమ సబ్జెక్టులపై చురుకైన ఆసక్తిని పెంపొందించుకోవాలి.చదువుతున్నప్పుడు పరధ్యానాలను తగ్గించుకోవాలి. నేర్చుకున్న విషయాన్ని సొంతమాటల్లో పునశ్చరణ చేసుకుంటూ ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పటమో, రాసుకోవటమో చేస్తే సబ్జెక్టు జ్ఞాపకముంటుంది.
మనకు తెలిసిన అంశాలతో కొత్తగా నేర్చుకుంటున్నవాటిని కలిపి నేర్చుకోవటం కీలకమైన జ్ఞాపకశక్తి టెక్నిక్‌. ఉదాహరణకు- చారిత్రక తేదీలను గుర్తుంచుకోవాలంటే.. వాటిని వ్యక్తిగత అనుభవాలు/ దృశ్య చిత్రాలతో అనుసంధానించాలి. సంక్లిష్ట సిద్ధాంతాలను గుర్తుంచుకునే విద్యార్థులకూ, కొత్త భావనలను నేర్చుకునే నిపుణులకూ ఈ పద్ధతి ఉపయోగకరం.
విజువలైజేషన్‌ శక్తి
మెదడు పాఠ్యరూపంలో, విన్న రూపంలో గుర్తుపెట్టుకున్న సమాచారం కంటే చిత్రాల రూపంలో చూసిన సమాచారాన్ని బాగా గుర్తుంచుకుంటుంది. శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు పేర్లను గుర్తుంచుకోవడం కంటే శరీర భాగాలను మనసులో స్పష్టమైన చిత్రాలుగా ఊహించుకుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

పెద్ద మొత్తంలో సమాచారాన్ని చిన్న, అర్థవంతమైన భాగాలుగా విభజించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. పొడవైన సంఖ్యల శ్రేణిని భాగాలుగా విభజించడం (పది అంకెల ఫోన్‌ నంబర్లను మూడేసి అంకెలుగా లేదా నాలుగేసి అంకెలుగా గుర్తుంచుకోవడం లాంటివి) వల్ల వాటిని సులభంగా మెదడు గుర్తుంచుకుంటుంది.
పునశ్చరణ, సమీక్ష
పరీక్షకు ముందు రోజు రాత్రి ఏడాది సిలబస్‌ అంతా ఒకే పట్టున గుర్తుంచుకొని పరీక్షలు రాసేస్తుంటారు చాలామంది. ఈ ‘క్రామింగ్‌’ స్వల్పకాలిక జ్ఞాపకశక్తికి సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలిక
జ్ఞాపకశక్తికి వ్యవధితో కూడిన పునశ్చరణ కీలకం. క్రమం తప్పకుండా సమాచారాన్ని తిరిగి మననం చేసుకోవాలి.

బలమైన భావోద్వేగాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సంఘటనలూ, అప్పుడు నేర్చుకున్న అంశాలూ బాగా గుర్తుండిపోతాయి. చదువుల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుని, వాటిని జీవితంలో ముఖ్య భాగమని నమ్మి ఒక బంధాన్ని ఏర్పరచుకుంటే నేర్చుకోవడాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
నెమానిక్స్‌ అంటే క్లిష్టమైన సమాచారాన్ని వేరే సంక్షిప్తరూపంలోనో, ప్రాసల రూపంలోనో గుర్తు పెట్టుకోవటం. విద్యార్థులకూ, మల్టీ టాస్క్‌ చేయాల్సిన యువతకూ ఇటువంటి సత్వరమార్గాలు ప్రయోజనకరం.
పరిశీలించే అలవాటు
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో నిశిత పరిశీలనకున్న ప్రాముఖ్యం ఎంతో. చాలామంది వివరాలను సరిగ్గా గమనించకపోవడం వల్ల విషయాలు మర్చిపోతారు. రోజువారీ జీవితంలో పేర్లు, ముఖాలు, ప్రదేశాలు, సంభాషణలను చురుకుగా గుర్తుంచుకుంటూ మైండ్‌ఫుల్‌నెస్‌ సాధన చేయాలి. .

మంచి నిద్ర, సరైన పోషకాహారం, ప్రభావవంతమైన వ్యాయామం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. బాగా విశ్రాంతి తీసుకున్న మెదడు.. సమాచారాన్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది. సరైన ఆహారం, నీరు ధారణ పనితీరును మెరుగుపరుస్తాయి.
గుర్తుంచుకునే సామర్థ్యాన్ని అనుమానించడం మానసిక అడ్డంకులను సృష్టిస్తుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యాలపై మనలో విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సానుకూల ప్రోత్సాహక ఆలోచనలు పెంచుకోవాలి. జ్ఞాపకశక్తిని ఎంత ఎక్కువగా విశ్వసిస్తే అది అంత మెరుగ్గా పనిచేస్తుంది.