ట్రాఫిక్ చలాన్లు మూడు నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్! : రాష్ట్ర రవాణా శాఖ

ట్రాఫిక్​ రూల్స్‌ను తరుచూ​ బ్రేక్​ చేస్తున్న వాహనదారులపై కొరడా ఝులిపించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. సీసీ టీవీ ఫుటేజీలకు చిక్కుతున్నా, వేలకు వేలు ఫైన్లు పడ్తున్నా మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తున్న వారికి చెక్​పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వరుసగా 3 నెలలపాటు ట్రాఫిక్​ చలాన్లు పెండింగ్​పెట్టినవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి తాజాగా వచ్చిన ప్రతిపాదనలపై రవాణా శాఖ సీరియస్‌గా దృష్టిపెట్టింది.


2 జిల్లాల పరిధిలోనే 10 వేల లైసెన్స్‌లు సస్పెండ్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్తున్న వాహనాదారులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 25 వరకు 18, 973 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో డ్రంకెన్​ డ్రైవ్​లో చిక్కినవారు, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసిన వాహనదారులు ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 10 వేల మందికిపైగా హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.

మరోవైపు ట్రాఫిక్​రూల్స్​ ఉల్లంఘిస్తున్న చాలా మంది చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చలానా జనరేట్​అయిన తర్వాత ట్రాఫిక్​పోలీసుల నుంచి వాహనదారుల నంబర్లకు మెసేజ్​పంపుతున్నారు. కానీ కొందరు వాహనాదారులు నెలలు, ఏండ్ల కొద్దీ ఫైన్లు చెల్లించడం లేదు. ఎప్పుడైనా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఒక్కోవాహనంపై వేల రూపాయల ఫైన్లు ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ మొత్తం కట్టలేక తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారని పోలీసులు చెప్తున్నారు.

లైసెన్స్ ​సస్పెన్షన్‌పై సర్కారుకు నివేదిక

ట్రాఫిక్ రూల్స్​ బ్రేక్​ చేస్తున్నవారిని గాడినపెట్టాలంటే ఎప్పటికప్పుడు ఫైన్లు వసూలు చేయాలని ట్రాఫిక్​ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో వాహనదారుడి బండిపై 3 నెలలకు పైగా ఫైన్లు పెండింగ్‌లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయించాలనే ప్రతిపాదనను రవాణా శాఖ అధికారుల ముందు ఉంచారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి అందించిన ప్రపోజల్స్​ సాధ్యాసాధ్యాలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు త్వరలో నివేదిక రెడీ చేసి సర్కారుకు అందజేయనున్నట్లు తెలిసింది. ఇది గనుక అమలైతే ట్రాఫిక్​రూల్స్​ అతిక్రమించేవారికి కళ్లెం వేయడంతోపాటు ఫైన్లను ఎప్పటికప్పుడు క్లియర్​చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.