LIC’s new plan: ఒకే చెల్లింపు.. జీవితకాల ఆదాయం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా ‘స్మార్ట్ పెన్షన్’ (Smart Pension) ప్లాన్‌ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది.


దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.

ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.

నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

అర్హత & ప్లాన్ వివరాలు
18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.

స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌కు.. మార్కెట్‌తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.