తరుణ్, జెనీలియా జంటగా గతంలో వచ్చిన ‘శశిరేఖా పరిణయం’సినిమాలో గాయాలపాలైన హీరోయిన్ చనిపోతానన్న భయంతో అప్పటికప్పుడు తన ప్రేమను హీరోకు చెప్తుంది.
అచ్చం అలాగే తాము చనిపోవడం ఖాయమని భావించిన విమాన ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్‌ఫోన్లలో వీలునామాలు, పాస్‌వర్డ్‌లు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఈ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
జూన్ 30న చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో ఇలా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కిందకు దిగొచ్చి ప్రయాణికులకు గాల్లోనే చుక్కలు చూపించింది. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా విమానాన్ని సమీప ఒసాకా నగరంలోని కన్సాయ్ విమానాశ్రయంలో రాత్రి 8.50 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బందిసహా విమానంలోని మొత్తం 191 మంది ఊపిరి పీల్చుకున్నారు.
జపాన్‌లోని టోక్యో నరీటా ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 737 విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 6.53 నిమిషాలకు ఈ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. విమానంలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాత్రివేళ హాయిగా నిద్రపోతున్న వేళ విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనై కిందకు దూసుకురావడం, ప్రయాణికులు ఉన్నట్లుండి తమ సీట్లలోంచి ఎగిరి పైకప్పునకు ఢీకొనడం, ఆక్సీజన్‌లు మాసు్కలు పెట్టుకోండని సహాయక సిబ్బంది ఏడుస్తూ చెప్పిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు రికార్డ్‌చేశారు.
ఇక, తాము ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై చనిపోతామని భావించిన ప్రయాణీకులు.. అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్‌ఫోన్లలో వీలునామాలు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఇంకొందరేమో తమ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల పిన్ నంబర్లు, లాగిన్ పాస్‌వర్డ్‌లు పంపించారు. మరి కొందరు బీమా మొత్తాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలను మెసేజ్‌లుగా పంపించారు. 36,000 అడుగుల ఎత్తు నుంచి విమానం 10,500 అడుగుల దిగువకు స్వేచ్ఛగా పడిపోతుండటంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలా మంది ప్రయాణికులు ఇలా తమ చివరి కోరికలు, వీలునామాలను స్మార్ట్‌ఫోన్‌లో తమ కుటుంబసభ్యులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
































