Gold Loan: అప్పు తీర్చేందుకు అప్పు

బంగారు రుణాలు చెల్లించటానికి.. ప్రైవేటు బాకీలు


  • గతంలో మాదిరిగా లోన్‌ రెన్యువల్‌ చేయని బ్యాంకర్లు
  • అసలు, వడ్డీ, మొత్తం చెల్లించి ఖాతా మూయాల్సిందే
  • ఆ తర్వాత కావాలంటే.. మళ్లీ కొత్తగా అప్పు మంజూరు
  • బ్యాంకర్ల నూతన నిబంధనలతో అన్నదాతల అవస్థలు

గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన రైతు మద్దిలేటి.. నిరుడు యూనియన్‌ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఏడాది గడిచింది. లోన్‌ చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేశారు. గతంలో మాదిరిగా వడ్డీ చెల్లించి, లోన్‌ రెన్యువల్‌ చేసుకోవటానికి మద్దిలేటి బ్యాంకుకు వెళ్తే.. అసలుతో సహా వడ్డీ చెల్లించాలని మెలికపెట్టారు.

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన రైతు వరంగంటి సంతోష్‌కు.. స్థానిక స్టేట్‌ బ్యాంకులో రూ.5 లక్షల గోల్డ్‌ లోన్‌ ఉంది. వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేస్తానంటే బ్యాంకర్లు ఒప్పుకోలేదు. దీంతో ప్రైవేటు ఫైనాన్స్‌లో అప్పు తీసుకొని అసలు, వడ్డీ కలిపి మొత్తం అప్పు చెల్లించాడు.

ఈ సమస్య ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు.. రాష్ట్రంలోని అనేక మంది రైతులది. బ్యాంకర్లు నిబంధనలతో పాటు సాఫ్ట్‌వేర్‌ కూడా మార్చటంతో గోల్డ్‌ లోన్‌ తీసుకున్న రైతులకు.. వడ్డీతో సహా అప్పు సహా చెల్లించటం ఇబ్బందికరంగా మారింది. దీంతో లోన్‌ కట్టడానికి వారు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా భావించి వడ్డీ వ్యాపారులు రైతుల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. కొందరు రైతులు ప్రైవేటు అప్పు కూడా దొరక్క, బ్యాంకులో లోను రెన్యువల్‌ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులు రాష్ట్రంలో 18 లక్షల మంది ఉన్నారు. గతేడాది వానాకాలం అప్పు తీసుకున్న రైతుల రుణాలు ఇప్పుడు రెన్యువల్‌కు వచ్చాయి. అయితే బంగారం రుణాల విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తున్నారు. గతంలో ఏడాదికాగానే బ్యాంకుకెళ్లి లెక్కచూసుకొని, వడ్డీ చెల్లిస్తే లోన్‌ రెన్యువల్‌ చేసేవారు. ఇప్పుడు అసలు, వడ్డీ మొత్తం చెల్లించాలనే నిబంధన పెట్టారు. మూడు నెలలుగా దీనిని అమలుచేస్తున్నారు. ఒకసారి బంగారం తాకట్టు పెట్టి రుణం ఇస్తే.. ఆ ఖాతా నంబరును ఏడాదికాగానే మూసేస్తున్నారు. మళ్లీ ఖాతాపై గోల్డ్‌ లోన్‌ ఇస్తున్నారే తప్ప.. పాత ఖాతాపై రెన్యువల్‌ చేయటంలేదు. తాకట్టు పెట్టిన బంగారంపై 9 శాతం వడ్డీ వసూలుబ చేస్తున్నారు. 10 గ్రాముల బంగారానికి రూ.58 వేల చొప్పున అప్పు ఇస్తున్నారు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కాస్త ఎక్కువ కూడా ఇస్తున్నాయి. అయితే ఏడాది కాగానే గోల్డ్‌ లోన్‌ పూర్తిగా తీర్చాలనే నిబంధన వల్లే సమస్య వచ్చింది. ఒకవేళ సకాలంలో చెల్లించకపోతే 3 నెలలు చూసి.. తర్వాత ‘ఎన్‌పీఏ'(నాన్‌ పేయింగ్‌ అకౌంట్‌) జాబితాలో చేర్చుతున్నారు. అయితే నిర్ణీత వ్యవధిలో వడ్డీతో సహా అప్పు చెల్లించటం రైతులకు ఇబ్బందిగా మారింది. పైగా వానాకాలం సాగు సీజన్‌లో పెట్టుబడికి డబ్బులు సర్దుబాటు చేసుకోవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. మొత్తం లోన్‌ ఏకకాలంలో తీర్చటానికి డబ్బులు సర్దుబాటు చేసుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొందరు బ్యాంకర్ల వడ్డీ వ్యాపారం..

‘ఇప్పటికైతే అసలు, వడ్డీ మొత్తం చెల్లించండి. కావాలంటే మరుసటి రోజు వచ్చి కొత్తగా అప్పు తీసుకోండి’.. అని బ్యాంకర్లు రైతులకు చెబు తున్నారు. కొందరు బ్యాంకర్లు.. భార్యాభర్తలకు బ్యాంకు ఖాతాలుంటే.. ఒకరి పేరుమీద ఉన్న అప్పును వడ్డీతో సహా వసూలుచేసినట్లు ఎంట్రీ చేసి.. మరొకరి పేరుమీదకు అప్పును మళ్లిస్తున్నారు. ఈ వెసులుబాటు అందరు రైతులకు ఉండటంలేదు. మరికొందరు బ్యాంకర్లు వినియోగదారులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీ రేటు మాట్లాడుకొని.. వడ్డీతో సహా అప్పు చెల్లించటానికి సరిపడా సొమ్మును వారి ఖాతాలకు బదిలీచేసి అధిక వడ్డీ తీసుకుంటున్నారు. ఈ వడ్డీ రేటు వందకు నాలుగైదు రూపాయలు ఉండటం గమనార్హం. అయితే ప్రైవేటు అప్పులు అందరికీ దొరక్కపోవటంతో గోల్డ్‌ లోన్‌ పూర్తిగా కట్టడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకర్లు ఈ నిబంధన మార్చాలని, వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.