బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌

ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. సాధారణంగా మే నెల చివరి వారంలో.. ఎండలు మండిపోతాయి. కానీ ఈసారి మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వేసవి తాపం తక్కువగా ఉండే మార్చి, ఏప్రిల్‌లో ఎండలు మండిపోగా.. భానుడు భగభగ మండిపోవాల్సిన మే నెలలో మాత్రం.. తరచుగా వర్షాలు కురుస్తూ.. వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇక ఈ ఏడాది దేశంలోకి రుతుపవనాలు త్వరగానే ప్రవేశిస్తాయని.. జూన్‌ మొదటి వారంలోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..


ఈనెల 22న బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో నేటి నుంచి అనగా.. మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఈనెల 24న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. దాని వల్ల గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. అల్ప పీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

ఇక నేడు అనగా మంగళవారం సాయంత్రం సాయంత్రం తర్వాత హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేశారు. ఇక అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక బంగాళా‌ఖాతంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.