‘Lucky Bhaskar’.. కరీంనగర్‌ టు దుబాయ్‌.. వయా జగిత్యాల

జీబీఆర్‌ క్రిప్టో కేసులో భారీ హవాలా కోణం


లక్కీ భాస్కర్‌’ రమేశ్‌గౌడ్‌కు హవాలా వ్యాపారులతో లింకులు

దాదాపు రూ.40 కోట్ల వరకు దుబాయ్‌కి పంపినట్లు అనుమానం

కస్టమర్ల నుంచి బీఎన్‌బీ, యూఎస్‌డీటీ ద్వారా సేకరణ

రమేశ్‌ వసూలు చేసిన డబ్బు వివరాలు రాబట్టేదెలా?

త్వరలో సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నా ఆలోచనలో బాధితులు

క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) పేరిట అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ‘లక్కీ భాస్కర్‌'(Lucky Baskhar) సినిమా తరహాలో దేశం దాటిపోదామనుకున్న రమేశ్‌గౌడ్‌ (Ramesh Goud) కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు వసూలు చేసిన మొత్తంలో దాదాపు రూ.40 కోట్ల వరకు హవాలా ద్వారా దుబాయ్‌కి పంపినట్లు తెలిసింది. ఇందుకోసం అతను పలువురు హవాలా వ్యాపారులను ఆశ్రయించినట్లు సమాచారం. మొత్తం వసూలు చేసిన డబ్బును జగిత్యాల, వరంగల్‌ జిల్లాలోని హవాలా వ్యాపారుల సాయంతో హైదరాబాద్‌ మీదుగా దుబాయ్‌కి పంపారని ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహారంలో జీబీఆర్‌ రమేశ్‌గౌడ్‌ (Ramesh Goud) తాను ఎక్కడా దొరకకూడదన్న ఉద్దేశంతో చాలా తెలివిగా వ్యవహరించాడు. డబ్బుకు ఆశపడి అతడి మాటలు నమ్మిన బాధితులు వెంటనే తేరుకున్నారు. అతని ప్రతీ కదలిక, ప్రతీ లావాదేవీలను ఎప్పటికపుడు కనిపెట్టి సీఐడీకి అప్పగించారు. ఇందులో భాగంగానే ఇటీవల కరీంనగర్‌ సీఐడీ డీఎస్పీ పలుమార్లు రమేశ్‌గౌడ్‌తో రహస్య సమావేశాల వివరాలు కూడా ఉన్నతాధికారులకు అందించారు. దీంతో అతనిపై వేటు పడిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంతకాలమైనా కేసు దర్యాప్తులో పురోగతి లేదంటూ బాధితులు త్వరలో కరీంనగర్‌ సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నా చేసే ఆలోచనలో ఉన్నారు.

ఆధునిక విధానంలో వసూలు
క్రిప్టో కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న పెట్టుబడి కావడంతో సహజంగానే బాధితులు అతని మాటలు నమ్మారు. పైగా రామోజీ ఫిలింసిటీ, గోవా, సింగపూర్‌, మలేసియా, దుబాయ్‌ దేశాల్లో ఖరీదైన ఈవెంట్లు పెట్టడంతో కస్టమర్లు అతని జీబీఆర్‌ క్రిప్టోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇక్కడే రమేశ్‌గౌడ్‌ చాలా ఆధునికంగా ఆలోచించాడు. కస్టమర్ల నుంచి తొలుత దాదాపు రూ.30కోట్లకుపైగా డబ్బును కస్టమర్లు నగదు రూపంలో చెల్లించారని తెలిసింది. కస్టమర్లు మరీ అధికంగా డబ్బులు కడుతుండటంతో ఐటీకి చిక్కుతామని తెలివిగా వ్యవహరించాడు. అప్పటి నుంచి కస్టమర్ల నుంచి పెట్టుబడులను క్రిప్టో కాయిన్స్‌ అయిన బీఎన్‌బీ, యూఎస్‌డీటీ, క్రిప్టో వ్యాలెట్లు అయిన ట్రస్ట్‌వ్యాలెట్‌, బినాన్స్‌, వజ్రిక్స్‌ తదితర వాలెట్ల ద్వారా సేకరించాడు.

రూ.10 నోటు ద్వారానే అధికం
విదేశాల్లో వ్యక్తులకు అడిగినంత డబ్బును అందజేయడానికి హవాలా వ్యాపారులు ఉంటారు. ఉదా: రూ.కోటిని దుబాయ్‌కి పంపాలనుకుంటే.. అక్కడ తమ కమీషన్‌ మినహాయించుకుని మిగిలిన డబ్బును వారు చెప్పిన వ్యక్తికి అందిస్తారు. అది ఇవ్వాలంటే రూ.10 నోటును చింపి ఇస్తారు. విదేశాలకు వెళ్లి చినిగిన ముక్కను ఇస్తే.. మిగిలిన డబ్బు అందిస్తారు. ఇదే తరహాలో రమేశ్‌గౌడ్‌ తనకు రావాల్సిన డబ్బును హవాలా మార్గంలో సేకరించాడు. తాను చెప్పిన హవాలా వ్యాపారి వద్ద డబ్బులు కట్టించాడు. ఆ డబ్బును తాను ఇండియాలో కాకుండా తెలివిగా దుబాయ్‌లో డ్రా చేసుకున్నాడు.

అలా హవాలా, క్రిప్టో వ్యాలెట్ల ద్వారా డబ్బును దుబాయ్‌లో డాలర్ల రూపంలోకి మార్చుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.40 కోట్ల డాలర్ల వరకు డ్రా చేసుకుని అలా అక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు. అలా అక్కడ పదేళ్ల వరకు నివసించేలా వీసా సంపాదించడాన్ని సీఐడీ అధికారులు కూడా గుర్తించిన విషయం తెలిసిందే. దేశం దాటిపోయిన బాధితుల డబ్బును తిరిగి తీసుకురావడం సీఐడీకి సవాలుగా మారింది. మనీలాండరింగ్‌ జరిగిన నేపథ్యంలో కేసు సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.