లంచ్ బాక్స్‌లో ఫుడ్ మధ్యాహ్నం వరకు వేడిగా, రుచిగా ఉండాలా? ఈ టెక్నిక్స్ తెల్సుకోండి

www.mannamweb.com


ఆఫీసుకు, స్కూలుకు, కాలేజీలకు లంచ్ బాక్స్ తప్పకుండా తీసుకెళ్లాల్సిందే. అయితే తినే సమయానికి ఆహారం చప్పగా, చల్లగా, రుచిలేకుండా అయిపోతుంది. అలా అవ్వకుండా మీకు కొన్ని బెస్ట్ టిప్స్ చెప్పబోతున్నాం చూడండి.

స్కూల్ అయినా, కాలేజీ అయినా, ఆఫీస్ అయినా తప్పకుండా లంచ్ బాక్స్ తీసుకెళతారు. ఆడవాళ్లు లంచ్ బాక్స్‌లు తీసుకోకుండా భర్తలను, పిల్లలను ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వరు. కానీ లంచ్ బాక్స్ లో ఉంచిన ఆహారం దాన్ని తినే సమయానికి చల్లగా, చప్పగా, రుచిలేకుండా అయిపోతుంది. వేడి ఆహారంలో ఉండే రుచి చల్లని ఆహారంలో ఎక్కడ ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేసిన ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది.

ఇన్సులేటెడ్ కంటైనర్లు:

పాఠశాల లంచ్ బాక్సుల కోసం ఇన్సులేటెడ్ కంటైనర్లు వాడండి. వీటిలో ప్యాక్ చేసిన భోజనం మధ్యాహ్నం వరకైనా వేడిగా ఉంటుంది. దీంతో ఆహారం తాజాగానూ ఉంటుంది.

అల్యూమినియం ఫాయిల్:

లంచ్ బాక్స్ లో ఆహారాన్ని ఎక్కువసేపు వెచ్చగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించవచ్చు. రోటీ, పరాఠా లేదా పూరీని ఎక్కువసేపు వేడిగా, తాజాగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి లంచ్ బాక్స్ లో ప్యాక్ చేయాలి. ఈ అల్యూమినియం ఫాయిల్ చుట్టడం వల్ల ఎక్కువ సేపు వేడిగా, తాజాగా ఉంటాయి.
థర్మల్ బ్యాగులు:

థర్మల్ బ్యాగుల సహాయంతో లంచ్ బాక్స్ ఆహారాన్ని ఎక్కువ సేపు వెచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు. థర్మోప్లాస్టిక్ నుంచి థర్మల్ బ్యాగులను తయారు చేస్తారు. లంచ్ బాక్స్ వీటి లోపల ఉంచినప్పుడు ఆహారం లోని వేడిని ఈ బ్యాగ్ బయటకు వెళ్ళనివ్వదు. దీనివల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఈ బ్యాగుల ధర కూడా ఎక్కువేం ఉండదు.
థర్మల్ లంచ్ బాక్సులు:

మీరు తరచూ లంచ్ బాక్స్ వాడేవాళ్లయితే ఈ థర్మల్ లంచ్ బాక్స్ కొనుక్కోవడం ఉత్తమ మార్గం. వీటిలో పెట్టిన ఆహారం చాలా సేపు వేడిగా ఉంటుంది. అంతే కాకుండా మీరు తినే పది నిమిషాల ముందు దీనికుండే ప్లగ్ ఆన్ చేస్తే ఆహారం వేడిగా అయిపోతుంది. మీ వెంటే ఒక ఓవెన్ ఉన్నట్లు అనుకోండి. వీటి ధర కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ ఆహారం వేడిగా, రుచిగా ఉండాలంటే ఇది మంచి ఎంపికే.

హాట్ వాటర్ బాటిల్:

ఒకట్రెండు గంటల్లో లంచ్ బాక్స్ ఖాళీ చేస్తారు అనుకుంటే ఈ పద్ధతి సూపర్‌గా వర్కవుట్ అవుతుంది. ఒక బాటిల్‌లో వేడి నీళ్లు నింపి దాన్ని లంచ్ బాక్స్ బ్యాగులో పెట్టాలి. ఈ వేడికి ఆహారం గంట సేపైనా వేడిగా, తాజాగా ఉంటుంది.