మహా కుంభమేళా – ప్రతి మూడు తరాల్లో.. ఒక తరానికే ఆ అదృష్టం, ఆ రోజు నుంచే రాజస్నానం

www.mannamweb.com


భక్త జన కోటి సందడి, సాధువుల సంగమం, దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజలు..

ఇలా హిందూ సనాతన ధర్మంలో.. మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం.. వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కాబోతోంది. మొత్తం.. 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26న ముగుస్తుంది ఈ మహా కుంభమేళా జాతర. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే.. ఆధ్యాత్మిక మహా కుంభమేళాలో పాల్గొనేందుకు, త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్య స్నానం ఆచరించేందుకు.. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు.

ఇప్పుడు జరిగేది పూర్ణకుంభమేళ

మహా కుంభమేళా కంటే ముందు నాలుగేళ్లకోసారి కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఆరేళ్లకు అర్ధ కుంభమేళా, పన్నెండేళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఈ పూర్ణకుంభమేళానే ఇప్పుడు మహా కుంభమేళా అని పిలుస్తున్నారు. ఇంతకుముందు.. 2013లో ప్రయాగ్‌రాజ్‌లోనే మహా కుంభమేళా నిర్వహించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు.. మహా కుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. మకర సంక్రాంతి నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది.

144 సంవత్సరాలతో సమానం

వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసముంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు.. దాదాపు పన్నెండేళ్ల సమయం పడుతుంది. అందుకోసమే.. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో మహా కుంభమేళాను నిర్వహిస్తారు. అదేవిధంగా.. ప్రతి మూడేళ్లకోసారి వివిధ ప్రదేశాల్లో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను జరుపుతారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు.. హరిద్వార్‌లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ గ్రంథాల ప్రకారం.. భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం. దీని ప్రకారం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకోసమే.. 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే.. ఈ సమయంలో భూమిపై మహా కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

12 సంవత్సరాలకే ఎందుకు?

భారతదేశంలో హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో.. మహా కుంభమేళా ఒకటి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవమే.. హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన మేళా. మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే.. ప్రతి 12 ఏళ్లకోసారి మాత్రమే.. మహా కుంభమేళా జరుపుకునే సంప్రదాయం వెనుక పెద్ద కథే ఉంది. ఈ పవిత్ర ఉత్సవం.. భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలైన.. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినీలో నిర్వహిస్తుంటారు. కుంభ మేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే.. మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో.. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం నదుల్లోని నీరు అమృతంలా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు.

ఎప్పటి నుంచి మొదలు

మహా కుంభమేళా సమయంలో.. భక్తులు ఆచరించే రాచ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2025లో కుంభమేళాలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయ్. మొదటి రాచ స్నానం వచ్చే జనవరి 13న.. పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. రెండో రాచ స్నానం.. జనవరి 14న మకర సంక్రాంతి రోజున చేస్తారు. ఇక.. మూడో రాచ స్నానం జనవరి 29న.. మౌని అమవాస్య రోజున చేస్తారు. నాలుగో రాచ స్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున చేస్తారు. ఐదో రాచ స్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున చేస్తారు. ఇక.. చివరిదైన ఆరో రాచ స్నానం.. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున చేస్తారు. ఈ రాచ స్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది. మహా కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే.. సమస్త పాపాలు నశించి.. మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

సకల దేవతల ఆశీస్సులు…

మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు. ఇక.. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే మహా కుంభమేళాలో ఆచరించే పుణ్య స్నానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగ, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి.. దీనిని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి.. మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం.. ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

పన్నెండేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారని తెలుసు. కానీ.. పన్నెండేళ్ల వ్యవధిలోనే మహా కుంభమేళాని ఎందుకు నిర్వహిస్తారు? మతపరంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళా వెనుక ఉన్న పురాణాలు, భక్తుల నమ్మకాలు ఏంటి? అసలు.. మహా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్రేంటి? ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం వెనుక దాగున్న రహస్యమేంటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కుంభమేళా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి, సాధువులకి ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు. దీనిని.. ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం.. క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు.. దీనిని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అయితే.. ఈ భూమిపై అమృతం పడిన నాలుగు ప్రదేశాల్లో నిర్వహించే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే.. ఈ మహా కుంభమేళా. అందుకోసమే.. హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి.. ఇంత ప్రాముఖ్యతనిస్తారు.

ప్రతి 3 తరాల్లో.. ఒక తరానికే ఆ లక్

12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత.. 144 ఏళ్లకు ఓసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. అయితే.. ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే.. మహా కుంభమేళా అంటున్నారు. నిజానికి.. మహా కుంభమేళా చూసే అదృష్టం.. ప్రతి 3 తరాల్లో.. ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. కుండనే..సంస్కృతంలో కుంభం అంటారు. దానినే.. కలశం అని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం.. కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే.. కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి.. సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే.. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో నిర్వహిస్తారు. అలాగే.. గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు.. ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు.

కుంభమేళా వెనుక ఉన్నకథ ఇదే

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి.. పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం.. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో.. అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకొచ్చాయ్. వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకొచ్చింది. దాని కోసం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది.. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా.. అమృతం ఒలికిన ఆ నాలుగు ప్రదేశాలే ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను.. అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అక్కడే.. కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు.. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.

రాజస్నానం అంటే?

పవిత్రమైన మహా కుంభ మేళాలో ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఈసారి జరగబోయే మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే.. ఇందులో విశేషంగా చేసే రాజ స్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్య తిథుల్లో నదీస్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. ఈ సమయంలో నదుల్లో నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహా కుంభమేళాలో.. వసంత పంచమి రోజున నాల్గవ రాచ స్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధించడం, పూజించడం విశేషంగా జరుగుతుంది. అదే రోజు నిర్వహించే నాల్గవ రాజ స్నానం కోసం.. ప్రత్యేకమైన శుభ ముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై.. 6 గంటల 16 నిమిషాలకు అమృత ఘడియలు ముగియనున్నాయి.

ఇలా నిర్వహిస్తారు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలే కాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలుస్తాయ్. కుంభమేళా సమయంలో.. నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో.. హారతి నిర్వహిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. అంతేకాదు.. మతపరమైన ఆచారాలతో పాటు, సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాళ్లను ఏర్పాటు చేసి.. భక్తి గీతాల శబ్దాలతో.. ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో.. ఆ వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. మహా కుంభమేళా కేవలం ఓ ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగానూ ఉంటుంది.

45 కోట్ల మంది యాత్రికులు..

12 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు.. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు సాగుతున్నాయ్. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి.. అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రయాగ్‌రాజ్‌ని సిద్ధం చేస్తున్నాయ్. దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యాటకుల కోసం సన్నాహాలు చేస్తోంది యోగి సర్కార్. గతంలో కంటే.. ఈసారి అద్భుతంగా మహా కుంభమేళాను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.2100 కోట్లతో భారీగా ఏర్పాట్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు.. విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈసారి.. దాదాపు 45 కోట్ల మంది మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే.. ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు ఈసారి భారీ ఎత్తున తరలిరానున్నారు. ఈ మహా కుంభమేళాను.. స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా.. డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు.. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్.. ప్రణాళికలు సిద్ధం చేసింది. మహా కుంభమేళా నిర్వహణ కోసం.. కేంద్ర ప్రభుత్వం 2100 కోట్ల స్పెషల్ గ్రాంట్‌ని మంజూరు చేసింది. ఇందులో.. మొదటగా 1050 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే.. ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 3లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవలే.. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో 5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహాకుంభమేళాతో దేశం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. కులాలు, తెగలు అనే తారతమ్యం లేకుండా.. హిందువుల ఐక్యతను చాటే కుంభమేళా మహాయజ్ఞాన్ని తలపిస్తుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా 100 పడకల ఆస్పత్రి

మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన సేవలు అందించేందుకు.. 100 పడకలతో ఓ ఆస్పత్రి, అదేవిధంగా 20 పడకలతో రెండు ఆస్పత్రులు, 8 పడకలతో.. చిన్న చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. 10 పడకలతో ఐసీయూని.. ఆర్మీ ఆస్పత్రి ఏర్పాటు చేసింది. యాత్రికులకు వైద్యసాయం అందించేందుకు దాదాపు 300 మంది డాక్టర్లు, వైద్య నిపుణులు, 90 మంది ఆయుర్వేద, యునానీ నిపుణఉలు, 200 మంది వరకు నర్సింగ్ సిబ్బంది ఉందుబాటులో ఉండనున్నారు. త్రివేణి సంగమం దగ్గర.. 35 శాశ్వత ఘాట్‌లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్‌లను నిర్మిస్తున్నారు. ఇక.. మహా కుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా 11 భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా మహాకుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణ, విడిది సౌకర్యాల వివరాలు ఉచితంగా తెలుసుకునే వీలు కల్పించారు. ఇక.. వాహనాల పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ పాస్‌లు జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య.. సమన్వయంతో పనులు జరుగుతున్నాయని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

గంగానది ప్రక్షాళన..

సనాతన ధర్మంలో అతిపెద్ద వేడుక మహా కుంభమేళా. దీనిని.. అద్భుతంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయ్. ఇప్పటికే.. 20 వేలకు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను కేటాయించారు. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్య వాడతో పాటు ప్రయాగవాల్ సభ, ఖాక్ చౌక్‌లకు స్థలాలు కేటాయించారు. కొత్త సంస్థలకు స్థలాలు కేటాయించనున్నారు. స్థలాలు, ఇతర సౌకర్యాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాలో తొలిసారి పాంటూన్ బ్రిడ్జ్‌ల సంఖ్య 22 నుంచి 30కి పెరిగింది. మేళా ప్రాంతంలో 250, నగరంలో 661 చోట్ల సైనేజ్‌లు ఏర్పాటు చేశారు. గంగానదిలో నీటి ప్రవాహం బాగుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నదుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయోరెమిడియేషన్, జియోట్యూబ్ పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం వందలాదిగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 48 వేల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో తొలిసారి గంగానది రివర్ ఫ్రంట్, పక్కా ఘాట్లు, జెట్టీలను నిర్మిస్తున్నారు.

3.25 హెక్టార్లలో డోమ్ సిటీ ఏర్పాటు

ఈ మహా కుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని నిర్మిస్తోంది. అరైల్ ప్రాంతంలో.. 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో దీనిని డెవలప్ చేస్తున్నారు. 51 కోట్లతో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించే విధంగా ఉండబోతోంది. మహా కుంభమేళాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఆలోచనల్లో భాగంగా.. ఈ డోమ్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోమ్ కాటేజీలో.. 360 డిగ్రీల్లో అన్ని వైపుల నుంచి చూసేందుకు వీలుంటుంది. 32 అడుగుల పరిమాణంతో.. మొత్తం 44 డోమ్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్, ఫైర్ ఫ్రూప్‌గా ఉండేలా.. వీటిని పాలికార్బొనేట్ షీట్లతో నిర్మిస్తున్నారు. 15 నుంచి 18 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డోమ్స్.. భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు రక్షణగానూ ఉంటాయి. ఈ డోమ్ సిటీలో.. అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలను కూడా నిర్మిస్తున్నారు.

100 ఏళ్ల కిందట.. చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా మొదలై..

మహా కుంభమేళాలో ఒక్క డోమ్ కాటేజీ రేటు.. లక్షా 10 వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో 81 వేలు ఉంటుంది. కాటేజీలు కూడా కుంభమేళాలో 81 వేలకు లభిస్తాయి. సాధారణ రోజుల్లో అయితే 41 వేలకు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే.. ఈ డోమ్స్, కాటేజీల కోసం ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ డోమ్ సిటీలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రదర్శనల కోసం ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ స్థాయి టూరిజం సౌకర్యాలతో దీనిని తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో జరిగే మహా కుంభమేళాలకు.. ఈ డోమ్ సిటీని ఓ ఎగ్జాంపుల్‌గా నిలిపేలా నిర్మిస్తున్నారు. మహా కుంభమేళా.. వందల ఏళ్ల క్రితం ఓ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ.. ఇప్పుడది అతిపెద్ద పండుగలా మారిపోయింది. ఈసారి జరగబోయే మహా కుంభమేళాను.. ఓ సక్సెస్ స్టోరీగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.