ఇండియాలో 7 సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లను కొనడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అందువల్ల ఈ కార్లకు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక సెవెన్ సీటర్ కార్లలో మహీంద్రా XUV కార్ కి మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. కంఫర్ట్ విషయంలో కానీ ఫీచర్స్ విషయంలో కానీ ఈ కార్ వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇది మంచి లగ్జరీ కార్. పైగా బడ్జెట్ ధరలో ఉండటం వలన జనాలు దీన్ని కొనడానికి క్యూలో ఉంటారు. అందుకే ఈ కార్ అమ్మకాలు భారీగా ఉంటాయి. ఈ సూపర్ స్టైలిష్ కార్ ఎక్కువగా అమ్ముడుపోవడం వలన మహీంద్రా కంపెనీ మంచి లాభాలను పొందుతుంది.
ఇకపోతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గత నెలలో ఈ కార్ టాప్ ఎండ్ వేరియంట్ల ధరలను దాదాపుగా రూ.2.50 లక్షలు దాకా తగ్గించింది. ఇప్పుడు వేరే వేరియంట్ల ధరలను కూడా తగ్గించింది. వీటిలో తాజాగా ఎక్స్‌యూవీ 700 AX5 డీజిల్ ఆటోమేటిక్ 7-సీటర్ వెర్షన్ ధరపై భారీ డిస్కౌంట్ ఇచ్చింది. ఈ కార్ ధరని 70 వేల వరకు కంపెనీ తగ్గించింది. అంటే ఇప్పుడు ఎక్స్‌యూవీ 700 AX 5 డీజిల్ ఆటోమేటిక్ 7 సీటర్ ధర దాదాపు రూ.21 లక్షలు దాకా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్న AX 5 పెట్రోల్ మాన్యువల్ సెవెన్-సీటర్, AX 5 పెట్రోల్ మాన్యువల్ 7-సీటర్, ఎఎక్స్ 5 డీజిల్ మాన్యువల్ 7-సీటర్ వేరియంట్లపై కూడా రూ .50,000 డిస్కౌంట్ ఇచ్చింది కంపెనీ. అలాగే XUV 700 AX 3 డీజిల్ ఆటోమేటిక్ 7-సీటర్, ఏఎక్స్5 డీజిల్ ఆటోమేటిక్ 5-సీటర్ వేరియంట్లపై రూ .20,000 డిస్కౌంట్ ఇచ్చింది.ఇప్పుడు XUV 700 ఎక్స్-షోరూమ్ ధరలు రూ .14 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి.
ఈ స్టైలిష్ ఎస్యూవి కార్ ని 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంకా 2.2-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో మహీంద్రా కంపెనీ అందజేస్తుంది. ఈ ఎస్‌యూవీలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను మనం ఐదు లేదా ఏడు సీట్ల ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఉండే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కస్టమర్లని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఈ కార్ ని ఆగస్టు 14, 2021 న ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో రిలీజ్ చేసింది. అప్పటి నుంచి మహీంద్రా కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఈ XUV 700 సిరీస్‌లలో దాదాపు 2 లక్షలకు పైగా యూనిట్లను అమ్మగలిగింది.