దారుణం.. 8 మంది కుటుంబ సభ్యులను చంపి తర్వాత వ్యక్తి ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతికిరాతకంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.


ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాలో ఈ దారుణం జరిగింది. దినేశ్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎనిమిది రోజుల క్రితమే ఇతనికి వివాహం అయినట్లు తెలుస్తోంది. భార్యతో పాటు సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని దినేశ్‌ దారుణంగా గొడ్డలితో నరికి చంపాడని చెబుతున్నారు. ఎనిమిది మంది బోదకల్‌ కచర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వరండాలో నిద్ర పోతున్న సమయంలో నరికి చంపాడని చెప్పారు పోలీసులు. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని దినేశ్ సూసైడ్ చేసుకున్నాడు. మరోవైపు ఈ దారుణ హత్యలకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనట్లుగా మహుల్జీర్ పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మృతదేహాలను ఆస్పత్రికి తరలించామన్నారు.

ఈ సంఘటనపై దినేశ్ చిన్నాన్న తల్వీ సింగ్‌ స్పందించాడు. దినేశ్‌ తన అన్న కొడుకు అని చెప్పాడు. ఏడాది ఉంచి మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పాడు. కొంతకాలం చికిత్స అందించారనీ.. ఆ తర్వాత సాధారణంగానే ఉన్నాడని చెప్పాడు. మే 21వ తేదీన దినేశ్‌కు పెళ్లి చేశామన్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడతాడని ఎవరూ ఊహించలేదన్నాడు. పెళ్లయిన తర్వాత రోజు నుంచే మానసిక సమస్యలు బయటపడ్డాయని తల్వీ సింగ్ చెప్పాడు. గొడ్డలితో దినేశ్‌ కుటుంబ సభ్యులను నరికిన తర్వాత తమ అక్క కూతురు చూసిందనీ.. కేకలు వేసిందని చెప్పాడు. అంతలోనే ఆమెను కూడా గాయపర్చి సూసైడ్ చేసుకున్నాడని తల్వీ సింగ్ పటేల్ చెప్పాడు.